మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2023 (16:32 IST)

మహిళా రెజ్లర్లతో అసభ్యంగా ప్రవర్తించిన బ్రిజ్ ‌భూషణ్ - చాతిపై తాకడం... ఇంకా...

Brij Bhushan Singh
భారత మహిళా రెజ్లర్లు సంచలన ఆరోపణలు చేస్తున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ మెడకు క్రమంగా ఉచ్చు బిగుస్తుంది. ఆయనపై మహిళా అథ్లెట్లు చేసిన ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా, పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో అనేక సంచలన విషయాలను నమోదు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
మహిళా అథ్లెట్లతో బ్రిజ్ భూషణ్ దారుణంగా ప్రవర్తించారని, ఛాతీపై తాకడం, రెజ్లర్లతో అసభ్య పదజాలాన్ని ఉపయోగించి సంభాషించడం వంటివి చేసేవారని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌ కాపీలోని అంశాలను పలు జాతీయ మీడియా కథనాలు ప్రచురించాయి.
 
బ్రిజ్‌ భూషణ్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ భారత అగ్రశ్రేణి రెజర్లు గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలోనే ఏడుగురు మహిళా రెజర్లు ఆయనపై ఫిర్యాదులు చేయడంతో ఢిల్లీలోని కన్నౌట్‌ప్యాలెస్‌ పోలీసు స్టేషన్‌లో గత నెల రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఆరుగురు మహిళా రెజర్లతో మొదటి ఎఫ్‌ఐఆర్‌, మరో మైనర్‌ రెజ్లర్‌ తండ్రి ఫిర్యాదుతో రెండో ఎఫ్‌ఐఆర్‌ను ఏప్రిల్‌ 28న నమోదు చేశారు.
 
తమతో అత్యంత అనుచితమైన, దారుణమైన రీతిలో బెదిరింపులు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రెజ్లర్లు ఆరోపించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఆయనకు భయపడి మహిళా అథ్లెట్లు ఎప్పుడూ తమ గదుల్లో నుంచి బయటకు వచ్చినా బృందాలుగానే ఉండేవారనీ, అయినప్పటికీ.. ఆయన మా బృందంలో నుంచి ఒకరిని వేరుగా తీసుకెళ్లి అభ్యంతరకర ప్రశ్నలు అడిగేవారు. వాటికి సమాధానాలు చెప్పలేకపోయేవాళ్లం అని ఓ బాధితురాలు పేర్కొన్నారు. 
 
'ఓ రోజు ఆయన నన్ను పిలిచి నా టీ-షర్ట్‌ లాగారు. శ్వాస ప్రక్రియను చెక్‌ చేస్తున్నానంటూ నా ఛాతీపై, పొట్టపై అభ్యంతరకరంగా తాకారు. ఓసారి నాకు తెలియని ఓ పదార్థాన్ని తీసుకొచ్చి తినమని చెప్పారు. దాని వల్ల ఫిట్‌గా ఉంటావని, ప్రదర్శన బాగా చేయొచ్చని చెప్పేవారు అని మరో బాధితురాలు ఆరోపించింది. 
 
'విదేశాల్లో జరిగిన పోటీల్లో నేను గాయపడ్డాను. అప్పుడు ఆయన (బ్రిజ్‌భూషణ్‌) నా వద్దకు వచ్చి.. తనతో సాన్నిహిత్యంగా ఉంటే ట్రీట్మెంట్ ఖర్చులన్నీ ఫెడరేషనే భరిస్తుందని చెప్పారు' అని మరో బాధితురాలు తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేసింది. ఫొటో తీసుకుందామంటూ తనను బలవంతంగా గట్టిగా హగ్‌ చేసుకున్నారని మరో రెజర్ల్‌ ఆరోపించింది.
 
మరోవైపు, ఈ ఆరోపణలను బ్రిజ్‌ భూషణ్‌ ఖండిస్తూనే ఉన్నారు. రెజ్లర్లు చేసిన ఆరోపణలు నిజమని తేలితే తాను ఉరేసుకోడానికైనా సిద్ధమేనని తెలిపారు. మరోవైపు, బ్రిజ్‌ భూషణ్‌పై వచ్చిన ఆరోపణలపై త్వరలోనే తుది నివేదికను కోర్టులో సమర్పించేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.