క్యారెట్ హల్వా ఎలా చేయాలి.. ఆరోగ్య ప్రయోజనాలేంటి? (VIDEO)
క్యారెట్ హల్వాలో ఆరోగ్య ప్రయోజనాలెన్నో వున్నాయి. క్యారెట్ కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఎండకు కమిలి, రంగు కోల్పోయిన చర్మానికి క్యారెట్ మేలు చేస్తుంది. క్యారెట్ జ్యూస్ చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్త
క్యారెట్ హల్వాలో ఆరోగ్య ప్రయోజనాలెన్నో వున్నాయి. క్యారెట్ కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఎండకు కమిలి, రంగు కోల్పోయిన చర్మానికి క్యారెట్ మేలు చేస్తుంది. క్యారెట్ జ్యూస్ చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యారెట్‌లో విటమిన్ ఏ, బీలుండటంతో కంటిచూపు మెరుగవుతుంది.
ఇంకా హ్రస్వ దృష్టి, దూరదృష్టి లోపాలను దూరం చేసుకోవచ్చు. పిల్లలు క్యారెట్‌ను పచ్చిగా తినేందుకు ఇష్టపడరు. అందుకే సమ్మర్ హాలీడేస్‌లో ఇంట్లో వుండే పిల్లలకు మేలు చేసే క్యారెట్‌తో హల్వా ఎలా చేయాలో చూద్దాం..
కావలసిన పదార్థాలు:
క్యారెట్ - ఒక కేజీ
పాలు - ఒకటిన్నర లీటర్
ఏలకులు - పది
నెయ్యి - తగినంత
పంచదార- ముప్పావు కేజీ
ఎండు ద్రాక్షలు - గుప్పెడు
బాదం - గుప్పెడు
జీడిపప్పులు - గుప్పెడు
తయారీ విధానం:
ముందుగా క్యారెట్లను శుభ్రం చేసుకుని.. తురుముకోవాలి. కేజీ క్యారెట్లను తురుముకుని పక్కనబెట్టుకోవాలి. ఆపై ఒకటిన్నర లీటర్ పాలను స్టౌమీద వుంచి.. ఆ పాలు లీటర్ వచ్చేంత వరకు బాగా మరిగించాలి. అలా పాలు బాగా మరిగి.. చిక్కబడ్డాక అందులో క్యారెట్ తురుము చేర్చాలి. ఈ క్యారెట్ తురుము బాగా ఉడికేంతవరకు మూతపెట్టి సన్నని సెగపై వుంచాలి.
క్యారెట్ మెత్తగా ఉడికిన తర్వాత యాలకుల పొడిని చేర్చాలి. ఈ క్యారెట్ తురుమును సన్నని సెగపై ముప్పై నుంచి నలభై నిమిషాలపాటు ఉడికించాలి. ఇలా పాలు, క్యారెట్ తురుము బాగా ఉడికి హల్వా లాంటి పక్వానికి వచ్చేదాక స్టౌమీదే వుంచాలి.
తర్వాత నెయ్యి, పంచదార, వేయించిన ఎండు ద్రాక్షలు, బాదంపప్పుల పలుకులు వేసి మరో ఐదు నిమిషాలపాటు ఉడకనివ్వాలి. తర్వాత దించేయాలి. అంతే క్యారెట్ హల్వా రెడీ. ఆరోగ్యానికి మేలు చేసే ఈ క్యారెట్ హల్వాను సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని మితమైన వేడిలో టేస్ట్ చేస్తే.. రుచి అదిరిపోతుంది.