గురువారం, 14 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 10 ఏప్రియల్ 2019 (22:13 IST)

పిల్లల కోసం స్వీట్ సమోసా... ఎలా చేయాలో తెలుసా?

సాయంత్రమయ్యేసరికి పిల్లలు రకరకాల స్నాక్స్ కావాలని, బయట దొరికేవే కావాలని గొడవ చేస్తుంటారు. బయట లభించే పదార్దాలు ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఇంట్లోనే రకరకాల స్నాక్స్ చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అదే స్వీట్ అయితే ఇంకా ఇష్టంగా తింటారు. పిల్లలు ఎంతగానో ఇష్టపడే స్వీట్ సమోసాను ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థములు:
జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు (చిన్నగా కట్ చేసినవి)-  1 కప్పు
కొబ్బరి కాయ-  ఒకటి(తురుముకోవాలి),
పంచదార- మూడు  కప్పులు,
మిల్క్ మెయిడ్-  1 కప్పు,
యాలుకల పొడి-  టీ స్పూన్,
మైదా- పావు కిలో,
నెయ్యి-  కప్పు,
నూనె- పావుకిలో,
 
తయారుచేయు విధానం:
మైదాలో కొద్దిగా పంచదార పొడి, చిటికెడు ఉప్పు, టీ స్పూన్ నెయ్యి వేసి ముద్దలా కలిపి పక్కన పెట్టాలి. తరువాత స్టవ్ వెలిగించి ఒక గిన్నెపెట్టి దానిలో పంచదార, కొద్దిగా మిల్క్ మైడ్ వేసి తీగపాకం పట్టాలి. పాకంలో కొబ్బరితురుము వేసి గట్టిపడే వరకు కలుపుతూ ఉండాలి. గట్టి పడిన దానిలో యాలుకల పొడి వేసి కలిపి పక్కనపెట్టాలి. దీనిలో చిన్నగా కట్ చేసిన జీడిపప్పులు, బాదాం, పిస్తా పప్పులు వేసి కలిపి పక్కన పెట్టాలి. 
 
ఇప్పుడు మైదాని చిన్నచిన్న ఉండలుగా చేసి చెపాతిచెయ్యాలి. దీనిని మధ్యకు కట్ చేసి ఒక ముక్కను సమోసాలా చుట్టి దానిలో కొబ్బరి మిశ్రమం పెట్టి మూసి వెయ్యాలి. అలాగే మొత్తం సమోసాలు చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద నూనె వేడిచేసి తయారుచేసిన సమోసాలు వేసి దోరగా వేయించి తీసివేయాలి. ఇప్పుడు పంచదార తీగపాకం పట్టి వేయించిన సమోసాలు పాకంలో వేసి ఐదునిముషాలు వుంచి, తీసేయ్యాలి. పిల్లలు ఎంతగానో ఇష్టపడే స్వీట్ సమోసా రెడీ.