గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : మంగళవారం, 27 నవంబరు 2018 (15:04 IST)

నాడు మిత్రులే నేడు బద్ధశత్రువులు.. మంథని మంటలు

దుద్దిళ్ల శ్రీధర్ బాబు. మాజీ మంత్రి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. ఈయన మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నిజానికి మంథని స్థానానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రితో పాటు శాసనసభ సభాపతిని అందించిన సెగ్మెంట్. ఈ సెగ్మెంట్‌లో రాజకీయ చైతన్యం ఎక్కువ. 
 
గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తెరాస అభ్యర్తి పుట్ట మధు చేతిలో ఓడిపోయారు. కానీ, ఈ దఫా మాత్రం విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈయనకు మహాకూటమిలోని ఇతర పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. దీంతో కారు స్పీడుకు బ్రేకులు వేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. 
 
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గతంలో మంథని అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించి, ముఖ్యమంత్రిగా పని చేశారు. అలాగే, ఇదే స్థానం నుంచి గెలుపొందిన శ్రీపాద రావు అసెంబ్లీ సభాపతిగా ఉన్నారు. 2009 ఎన్నికల్లో దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి అప్పుడు ప్రజారాజ్యం పార్టీ తరపున బరిలోకి దిగిన పుట్ట మధుపై గెలుపొందారు. కానీ, 2014 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. శ్రీధర్ బాబును మధు చిత్తుచిత్తుగా ఓడించాడు. దీనికి రాష్ట్ర విభజన కూడా, తెరాస సెంటిమెంట్ ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. 
 
ఈ దఫా ఈ స్థానం నుంచి ఈ ఇద్దరు అభ్యర్థులు నువ్వానేనా అంటూ తలపడుతున్నారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధితో పాటు కేసీఆర్ హవా కారణంగా మధు కారులో దూసుకెళుతున్నారు. ఈ కారుకు బ్రేకులు వేయాలని శ్రీధర్ బాబు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు తాను మంత్రిగా ఉన్న సమయంలో చేసిన పనులతో గెలుపుబాటలో పయనించాలని భావిస్తున్నారు. అయితే, రెండోసారి విజయం కోసం పుట్ట మధు తీవ్రంగానే ప్రయత్నిస్తుండగా, ఈసారి ఎలాగైనా గెలవాలని శ్రీధర్ బాబు కృతనిశ్చయంతో ఉన్నారు. 
 
ఈ నియోజకవర్గంలో కమాన్‌పూర్, మంథని, కాటారం, మహదేవపూర్, ముత్తారం, మల్హర్, ముత్తారం అనే మండలాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో మొత్తం 1,69,482 ఓట్లు పోలుకాగా, పుట్ట మధుకు 84,037 ఓట్లు రాగా, శ్రీధర్ బాబుకు 64,677 ఓట్లు, టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నాగయ్యకు 9,733 ఓట్లు వచ్చాయి. 
 
అయితే, ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో మొత్తం 2,06,715 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 34,500 మంది ఓటర్లు అగ్రవర్ణాలకు చెందిన వారు ఉన్నారు. అలాగే, బీసీలు 1,03,00, ఎస్సీలు 37,170, ఎస్టీలు 16,200, ముస్లింలు 10,000, ఇతరులు 5,845 మంది చొప్పున ఓటర్లు ఉన్నారు. 
 
శ్రీధర్ బాబుకున్న అనుకూలతలను పరిశీలిస్తే గత ఎన్నికల్లో ఓడిపోయాడన్న సానుభూతి ఓటర్లలో ఉండటం, గతంలో మంత్రిగా ఉన్న సమయంలో ఆయన చేసిన అనేక అభివృద్ధి పనులు, అగ్రవర్ణాలకు చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండటం, ప్రభుత్వంపై వ్యతిరేకత, తాజామాజీ ఎమ్మెల్యే పుట్ట మధుపై అవినీతి ఆరోపణలు రావడం, తెరాస, టీడీపీకి చెందిన పలువురు మండలస్థాయి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం. అదేసమయంలో గత నాలుగున్నరేళ్లుగా ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం వంటివి ప్రతికూలతలుగా ఉన్నాయి. 
 
ఇకపోతే, పుట్ట మధు విషయానికొస్తే, తన ట్రస్టు తరపున అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం, ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలు విజయతీరాలకు చేర్చుతాయన్న నమ్మకం, స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలు సానుకూలంగా ఉండటం ఆయనకు కలిసివచ్చే అంశాలు.