శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 20 మార్చి 2021 (09:25 IST)

నేటి నుంచి ‘సాగర్’లో బీజేపీ పాదయాత్ర

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో విజయం కోసం బీజేపీ వ్యూహరచనకు పదునుపెడుతోంది. అందులో భాగంగా విజయాన్ని నిర్దేశించే, గిరిజనుల ఓట్లపై పార్టీ నాయకత్వం కన్నేసింది.

వారి ఓట్ల సాధన కోసం గిరిజన తండాలలో, ఐదురోజుల పాటు పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.  ఆ మేరకు గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో కార్యాచరణ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సంఘటనా ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్‌జీ, సాగర్ ఉప ఎన్నిక బాధ్యులయిన  సంకినేని వెంకటేశ్వరరావు, చాడా సురేష్‌రెడ్డి కలసి జిల్లా పార్టీ అధ్యక్షుడి సమన్వయంతో ఈ పాదయాత్రను ఖరారు చేశారు.

ఈనెల 20 నుంచి 24 వ తేదీ వరకూ ఐదురోజుల పాటు పాదయాత్రలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,  పాదయాత్ర ప్రారంభం రోజు హాజరవుతారా? లేక చివరిరోజు నిర్వహించే బహిరంగసభకు హాజరవుతారా అన్నది ఇంకా ఖరారు కాలేదు.

20వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పాదయాత్రను, గిరిజన వర్గానికి చెందిన మాజీ ఎంపీ రవీంద్రనాయక్ ప్రారంభించనున్నారు. ఆ మరుసటి రోజున మరో గిరిజన నేత, హరిజననేత ముఖ్య అతిథులుగా హాజరవుతారు.

ఆ విధంగా ప్రతిరోజూ జరిగే పాదయాత్రకు ఒక గిరిజన, మరో హరిజన నేత పాల్గొనేలా కార్యక్రమం రూపొందించినట్లు సమాచారం. ఇక చివరిరోజయిన 24న నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిథిలో ఒకచోట, భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసేందుకు సిద్ధమవుతున్నారు.

దానికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ నేత డికె అరుణ, మోత్కుపల్లి నర్శింహులు వంటి అగ్రనేతలు హాజరుకానున్నారు.