తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం
తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభంకానున్నాయి. విద్యాసంస్థలు తెరవచ్చని వైద్య ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చింది. ప్రత్యక్ష తరగతులు ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ అనుమతిచ్చింది.
అయితే విడతల వారీగా తరగతులను ప్రారంభించే యోచనలో విద్యాశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. 8వ తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధన ప్రారంభించే అవకాశం ఉంది. తరగతిలో 20 మంది పిల్లలకు పైగా ఉంటే రెండు సెక్షన్‌లుగా విభజించాలని భావిస్తున్నారు.
వివిధ రాష్ట్రాల్లో పాఠశాలలు తెరిచేందుకు అమలు చేస్తున్న విధానాలపై కేస్ స్టడీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్కూళ్లు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలంటూ విద్యాశాఖ సీఎంఓకు ప్రతిపాదనలు పంపింది.
అంతకుముందు పాఠశాలల పునఃప్రారంభంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు.
హాస్టల్‌లో ఉండే విద్యార్థులకు కరోనా పాజిటివ్ వస్తే పరిస్థితి ఏంటి?.. గత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం ఆరా తీసినట్లు తెలుస్తోంది.
థర్డ్ వేవ్ నేపథ్యంలో పిల్లలను తల్లిదండ్రులు స్కూల్స్‌కు పంపిస్తారా? లేదా?.. వివిధ అంశాలపై ఉన్నతాధికారులతో కేసీఆర్ మంతనాలు జరిపారు.