బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్

డబ్బు కోసం కన్నబిడ్డను అమ్ముకున్న తండ్రి.. ఎక్కడ?

డబ్బు కోసం కన్నబిడ్డను తండ్రే అమ్మేశాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో జరిగింది. దీనిపై బాలుడి మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
కరీమాబాదా‌కు చెందిన మసూద్ అనే వ్యక్తి నాలుగేళ్ల కుమారుడు అయాన్‌ ఇటీవల ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. పిల్లోడు కనపించక పోవడంతో ఇంట్లోని వారంతా ఆందోళన చెందుతున్నారు. కానీ, పిల్లోడి తండ్రి మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. ముఖ్యంగా బిడ్డ కనిపించకపోవడంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. భర్త పట్టించుకోకపోవడంతో తన సోదరుడికి చెప్పుకుని ఏడ్చింది. 
 
దీంతో అక్క ఇంటికి వచ్చిన అక్బర్.. తన బావ ప్రవర్తనను అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. మసూద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తన బిడ్డను అమ్మలేదని, పోచమ్మ మైదాన్‌లో ఉంటున్న తమ బంధువులకు పెంచుకునేందుకు ఇచ్చానని వెల్లడించాడు.
 
అయితే, అతని మాటల్లో వాస్తవమెంతో తేల్చేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. బంధువులకు పెంచుకోవడానికి బిడ్డను ఇస్తే, ఇంట్లో వారికి, భార్యకు తెలియకుండా చేయాల్సిన అవసరం ఏమిటని పోలీసులతో పాటు ఫిర్యాదుదారుడు సందేహిస్తున్నారు.