బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (16:05 IST)

భార్యకు మందు, గుట్కా అలవాటు.. అంతే భర్తే గొంతుపై కాలితో తొక్కి..?

భార్య ప్రవర్తనలో మార్పు కారణంగా ఓ భర్త ఆమెను హతమార్చిన ఘటన మారేడ్‌పల్లి బాలాజీ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాలాజీనగర్‌లోని భద్రయ్య వెంచర్‌లోని ఓ ఇంట్లో ఈనెల-15న అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం లభించింది. 
 
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరిపారు. ఆ మహిళను భర్తే గొంతుపై కాలితో తొక్కి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మృతురాలి భర్త ఈస్టు మారేడ్‌పల్లి గొల్లకిట్టి బస్తీకి చెందిన హబీబ్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య పేరు షేక్‌ భానుబేగం. ఆమెకు మద్యం సేవించడం, గుట్కాలు నమిలే అలవాటుంది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. 
 
తాను ఇంట్లో లేనిసమయంలో ఇతరులు వస్తున్నట్లు హబీబ్‌ గమనించాడు. అనుమానంతో ఎలాగైనా భార్యను అంతమొందించాలనుకున్నాడు. స్నేహితుడి సాయంతో భార్యతో గొడవపడిన హబీబ్‌ కాళ్లతో ఆమె తలపై తన్నుతూ మెడపై కాలితో తొక్కి హత్య చేశాడు. 
 
ఆ తర్వాత మృతదేహాన్ని ఇంట్లోని ఓ దుప్పటిలో చుట్టి గదిలోనే వదిలేసి పరారయ్యాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకున్నారు. శుక్రవారం కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు.