శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 1 డిశెంబరు 2020 (07:27 IST)

హైదరాబాద్‌ పోరు ప్రారంభం

హైదరాబాద్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం 7 గంటల నుంచి 150 డివిజన్లలో పోలింగ్‌ 
ప్రారంభమైంది. గ్రేటర్‌ పరిధిలో 74,67,256 మంది ఓటర్లు 1,122 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.

అధికార తెరాస అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా.. భాజపా 149, కాంగ్రెస్‌ 146, తెదేపా 106, ఎంఐఎం 51, సీపీఐ 17, సీపీఎం 12, ఇతర గుర్తింపు పొందిన పార్టీలు 76, స్వతంత్ర అభ్యర్థులు 415 మంది బల్దియా బరిలో ఉన్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు 9,101 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఎన్నికల కోసం 60 ఫ్లయింగ్‌స్క్వాడ్‌లు, 30 పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేశారు. మూడు కమిషనరేట్ల పరిధిలో జరగనున్న ఈ ఎన్నికలకు 51,500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

పోలింగ్‌ సిబ్బంది ఎన్నికల సామగ్రితో తమకు కేటాయించి కేంద్రాలకు తరలివెళ్లారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద కొవిడ్‌ నిబంధనలు అమలు చేయనున్నారు.

ఇప్పటికే ఆయా కేంద్రాల్లో మార్కింగ్‌ వేశారు. బ్యాలెట్‌ పద్ధతిలో ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు 18 రకాల గుర్తింపు కార్డులను రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించింది.

ఓటుహక్కు వినియోగించుకోవాలంటే ఎస్‌ఈసీ ప్రకటించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా పోలింగ్‌ కేంద్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సాయంత్ర 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.