మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 జులై 2022 (18:17 IST)

ఉప్పొంగుతున్న గోదావరి - మూడో ప్రమాద హెచ్చరిక జారీ

rain
గోదావరి నది ఉప్పొంగుతుంది. నదికి ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఫలింతాగ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మూడో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తుంది. 
 
ఇక్కడ ఆదివారం నుంచి నీటి మట్టం పెరుగుతూ వస్తుంది. ఇది సోమవారం సాయంత్రానికి 53 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 
 
వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు పెరగడంతో భద్రాచలంలోని స్నాన ఘట్టాలు, కల్యాణ కట్ట ప్రాంతం వరదనీటిలో మునిగింది. 
 
చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. 19 గేట్లను ఎత్తి 26,152 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి వరద పెరగడంతో జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ భద్రాచలం వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని తెలిపారు. 
 
మరోవైపు, ఆదిలాబాద్‌, కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో బుధవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.
 
అదేవిధంగా, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ (రూరల్), వరంగల్ (అర్బన్) మరియు జనగాం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఆరెంజ్ హెచ్చరికను జారీచేసింది.
 
ఇదిలావుండగా, రాష్ట్రంలోని దాదాపు 10 ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవడంతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు మంచిర్యాలలోని కొల్లూరులో 17.3, జయశంకర్ భూపాలపల్లిలోని ముత్తారం మహదేవ్‌పూర్‌లో 13.7, మంచిర్యాలలోని నీల్వాయిలో 13.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.