శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2020 (14:25 IST)

లిక్కర్ ధరలను పెంచుతున్న కేసీఆర్.. పంటలకు ధరలను ఎందుకు పెంచడం లేదు: రేవంత్ రెడ్డి

లిక్కర్ ధరలను పెంచుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. పంటలకు ధరలను ఎందుకు పెంచడం లేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి టీఆర్ఎస్ కు బీజేపీ బీటీమ్ గా వ్యవహరిస్తోందని ఆయన  మండిపడ్డారు.

హైదరాబాద్ లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి  మాట్లాడుతూ… కేసీఆర్, మైహోం రామేశ్వరావు ఇచ్చే కమిషన్లకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కక్కుర్తి పడ్డారని రేవంత్ ఆరోపించారు.

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో రామేశ్వరరావు భేటీ కావడం వెనుక కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఉన్నారని చెప్పారు. జైజ్యోతి సిమెంట్ కంపెనీని తిరిగి తెరిపించి… రామేశ్వరరావుకు ఆర్థిక ప్రయోజనాలను కల్పించడానికే ఇదంతా అని అన్నారు.

రైతుబంధు పథకం కేవలం ఎన్నికల బంధుగా తయారైందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. రుణమాఫీ ఎందుకు చేయడం లేదని నిలదీశారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఏటా 530 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తామంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని… వాస్తవానికి 180 టీఎంసీలకు మించి ఎత్తిపోయడం లేదని దుయ్యబట్టారు.