శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 3 జులై 2021 (20:32 IST)

తండ్రిని మించిన దుర్మార్గుడు జ‌గ‌న్: మంత్రి జగదీష్ రెడ్డి

ఆంధ్ర‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రిని మించిన దుర్మార్గుడ‌ని తెలంగాణా రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు. రెండు రాష్ట్రాల మధ్య జ‌ల వివాదాన్ని సృష్టించిందే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వమే అని ఆయన ఆరోపించారు. వారు సృష్టించిన సమస్యకు పరిష్కారం కనుగొనాలంటూ ప్రధానికి లేఖ రాయడం ముమ్మాటికి అక్కడి ప్రజలను మోసం చేయడమేనని అన్నారు.

కృష్ణా జలాల పై ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు.  కృష్ణా నదిని దోచుకపోయే పద్ధతుల్లో తండ్రి రాజశేఖర్ రెడ్డి దుర్మార్గానికి పాల్పడ్డారని ఆయన విరుచుకుపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించడం, పోతిరెడ్డిపాడును వెడల్పు చేయడం వంటి అహంకార పూరితంగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని తండ్రిని మించిపోయారన్నారు.

సర్వేల వరకు నిర్వహించుకుంటామని కోర్టుకు చెప్పిన ఆంధ్రా సర్కార్ పనులు కొనసాగించడం ఎంతవరకు సహేతుకమని మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.  తెలంగాణా ప్రజలను మోసం చేసినట్లే, కోర్టును కూడా మోసం చేసిన చరిత్ర ఉన్న వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రధానికి లేఖలు రాస్తున్నార‌ని విమ‌ర్శించారు.