మందుబాబులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కారు
మందుబాబులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేలా డిసెంబరు 31వ తేదీన రాత్రి మద్యం షాపులు తెరిచే ఉంటాయని తెలిపింది. బార్లు, పబ్బులు, మద్యం షాపులను తెరిచి ఉంచే సమయాన్ని పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ ఉత్తర్వుల మేరకు డిసెంబరు 31వ తేదీ అర్థరాత్రి ఒంటి గంట వరకు మద్యం షాపులు తెరిచి ఉంచుతారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. రిటైల్ షాపుల్లో అర్థరాత్రి 12 గంటల వరకు, 2బీ లైసెన్సు గల బార్లలో అర్థరాత్రి ఒంటిగంట వరకు మద్యం విక్రయాలు కొనసాగుతాయని వెల్లడించారు.
కరోనా కష్టకాలంలో మద్యం అమ్మకాలు ఆగిపోయినందున, లైసెన్సులు పొందిన యజమానులు, బార్ నిర్వాహకులకు మినహాయింపుగా ఈ మద్యం విక్రయించడానికి అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. దీంతో మద్యం బాబులతో పాటు పబ్బులకు వెళ్లే వారు తెగ సంబరబడిపోతున్నారు.