బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2020 (12:52 IST)

మెట్రో రైలు ప్రారంభోత్సవానికి కిషన్‌రెడ్డిని పిలవలేదేం?

జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు చేపట్టిన మెట్రో రైలు ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని పిలవకపోవడంపై టీఆర్‌ఎస్‌ సర్కారుపై కేంద్ర ప్రభుత్వం భగ్గుమంది.

తాను భారీఎత్తున నిధులు అందిస్తున్నా, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. ఈ ప్రయోజనాన్ని తన ఖాతాలో వేసుకుంటోందని భావిస్తున్న కేంద్రం.. అందుకు విరుగుడు చర్యలకు సన్నద్ధమైంది.

కేంద్రం నిధులు అందించిన ప్రాజెక్టు (మెట్రో) కు సంబంధించిన వ్యయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి సమీక్షించడంతో పాటు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.

ప్రతిపాదిత స్టేషన్‌లు, డిపోలు, ట్రాక్‌ పనుల పురోగతి తదితర అంశాలపై శనివారం మధ్యాహ్నం 12 గంటలకు దిల్‌ఖుషా గెస్ట్‌హౌజ్‌లో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌), ఎల్‌అండ్‌టీ ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు.

అనంతరం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌తో పాటు పలువురు సీనియర్‌ నాయకులు, మెట్రో ఉన్నతాధికారులతో కలిసి జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు మెట్రోలో ప్రయాణించనున్నారు.
 
జేబీఎస్-ఎంజీబీఎస్‌ మెట్రో మార్గాన్ని ఈనెల 7న సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి అధికారుల నుంచి ఆహ్వానం అందలేదని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

పైగా, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో, ఇలాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ప్రారంభించడమంటే ఉద్దేశపూర్వకంగానే చేసి ఉండవచ్చని బీజేపీ ముఖ్యనేతలు ఆరోపిస్తున్నారు.

తనకు ఆహ్వానం పంపించకుండా మెట్రో అధికారులు ప్రోటోకాల్‌ ఉల్లంఘించారని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు ఇప్పటికే తన అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.