శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 మే 2020 (14:15 IST)

తెలంగాణాలో చిత్ర విచిత్రాలు - మద్యం కోసం బారులుతీరిన అమ్మాయిలు

తెలంగాణాలో మద్యం షాపుల ముందు చిత్ర విచిత్ర విన్యాసాలు కనిపిస్తున్నాయి. మద్యం షాపుల ముందు కొందరు మందుబాబులు డాన్సులు వేశారు. మరికొన్ని మద్యం షాపుల ముందు క్యూలైన్లలో భారీ సంఖ్యలో మహిళలు వరుసలో నిలబడివున్నారు. మద్యం కోసం పెద్ద ఎత్తున రోడ్లపైకి మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా, ఫిలిం నగర్, రాయదుర్గం, హైటెక్ సిటీలో మద్యం కోసం మహిళలు క్యూకట్టారు. ఐటీ సెక్టారులోని పలు మద్యం షాపుల వద్ద మహిళలు బారులుతీరారు. 
 
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్‌డౌన్ సండలింపులతో పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. కానీ, తెలంగాణాలో మాత్రం బుధవారం నుంచి తెరిచారు. రాష్ట్రంలో కంటైన్మెంట్ క్లస్టర్లలో మినహా మిగిలిన ప్రాంతాల్లో ఈ వైన్ షాపులను తెరిచారు. దీంతో మందుబాబులతో పాటు.. యువతులు, మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి మందు షాపుల ముందు బార్లు తీరారు. వీరంతా సామాజిక భౌతిక దూరాన్ని పాటిస్తూ వరుస క్రమంలో వచ్చి మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. 
 
కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా 10 శాతం నుంచి 30 శాతం మేరకు మద్యం ధరలను పెంచింది. ఈ పెంచిన ధరలు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. అయినప్పటికీ మందుబాబులు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మద్యం కోసం ఎర్రటి ఎండలో వరుసలో నిలబడివున్న దృశ్యాలు రాష్ట్ర వ్యాప్తంగా కనిపించాయి.