ఆర్.ఆర్.ఆర్. ఎలక్షన్ ప్రమోషన్!
ఇప్పుడు దేశంలో అన్ని భాషల్లోనూ సినిమారంగంలో పెద్ద చర్చగా మారింది ఆర్.ఆర్.ఆర్. సినిమా ప్రచారం. దీనిపై రకరకాలుగా సోషల్ మీడియా వేదికగా కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక తెలుగు సినిమారంగంలోని చిన్న నిర్మాతలయితే ఆ సినిమా రావడం పండుగే కానీ ఈ ప్రచారం చూస్తే దేశంలో పేద్ద రాజకీయ పార్టీ ప్రచారంలా సాగుతోందని సెటైర్లు వేస్తున్నారు.
ఎలక్షన్లలో నిలబడినప్పుడు అన్ని ప్రాంతాలకు వెళ్ళి పర్యటించినట్లు రాజమౌళి తన టీమ్ (కేండిడెట్స్)తో ప్రచారం చేస్తున్నాడని సరదాగా అంటున్నారు. ఎలక్షన్లలో ఎన్నో రకాలుగా టీవీల్లో డిబేట్లు వుంటాయి .అదే విధంగా మరోవైపు టీవీ వేదికగా కీరవాణి కూడా తన భుజాలతపై ప్రచారాన్ని వేసుకున్నాడు. ఎన్.టి.ఆర్., రామ్ చరణ్‌లతో చిట్ చాట్ చేస్తూ, అన్ని విషయాలను రాబట్టుతున్నారు. మరోవైపు యాంకర్ సుమ కూడా ఇందులో భాగమైంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేవరకు వచ్చిన మీమ్స్ ని చూపించి సుమ ఆసక్తికరమైన విషయాలను రాబట్టింది. ఇక సుమ పై తారక్ పంచులు వేస్తూనే ఉండడంతో ఆమె కొద్దిగా చిన్నబుచ్చుకోవడం ఇంటర్వ్యూకే హైలైట్ గా మారింది. ఇక చివర్లో మీమర్స్ కి రాజమౌళి థాంక్స్ చెప్పడం గమనార్హం.
రాజకీయ ఎన్నికల్లో ప్రజలకు అన్నీ చవకగా ఇస్తాం. లేదంటే, ధరలు తగ్గిస్తామంటూ నాయకులు ప్రచారం చేయడం మామూలే. కానీ ఆర్.ఆర్.ఆర్. సృష్టికర్త రాజమౌళి మాత్రం ప్రేక్షకులకు టికెట్ ధరలు పెంచేశాడు. అందుకు తెలుగు రాష్ట్రాల్లోని ఇరు ప్రభుత్వాలు సినిమాటికెట్లపై ప్రేక్షకులకు అదనపు భారం వేసినట్లే, ఇదే అదనుగా మంగళవారంనాడే పెట్రోల్, డీజిల్ వంటి ధరలుకూడా సందడిలో సడేమియాగా ప్రభుత్వం పెంచిసినట్లుగా సెటైర్లు వేసుకుంటున్నారు. సో. ఆర్.ఆర్.ఆర్. అనేది సినిమా కాదు రాజమౌళి రాజకీయ పార్టీ అంటూ చలోక్తులు వినిపిస్తున్నాయి.