హీరో తారకరత్నకు కన్నీటి వీడ్కోలు - చితికి నిప్పంటించిన తండ్రి మోహన కృష్ణ
హీరో తాకరరత్న అంత్యక్రియలు సోమవారం ముగిశాయి. ఆయనకు చిత్రపరిశ్రమతో పాటు.. వేలాది మంది అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. తమ అభిమాన హీరోను చూసేందుకు అభిమానులతో పాటు తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆ తర్వాత మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. తారకరత్న చితికి తండ్రి మోహన్ కృష్ణ నిప్పు అంటించారు. ఈ అంత్యక్రియలను హీరో బాలకృష్ణ దగ్గరుడి పర్యవేక్షించారు.
అంతకుముందు మోకిలలోని తారకరత్న నివాసం నుంచి ఫిల్మ్ చాంబర్ వరకు తారకరత్న పార్థివదేహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడ అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంచారు. అక్కడ నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర జరిగింది. ఇందులో అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
శ్మశానవాటిక వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, నారా లోకేశ్, వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి, హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తదితరులు భౌతిక కాయానికి చివరిసారి నివాళులు అర్పించారు ఆ తర్వాత తారకరత్న చితికి తండ్రి మోహన్ కృష్ణ నిప్పంటించారు.