1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (11:59 IST)

మరణం లేని మధురస్వరం - నేడు ఎస్పీబీ తొలి వర్థంతి

శ్రీపతి పండితా రాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గళం తియ్యదనానికి మారు పేరు. సాహిత్యపు వయ్యారాలకు సుస్వరాల స్వర్ణతాపడం. ఆయన పాట జీవితంలోని ప్రతి భావోద్వేగంతో విడదీయలేనంతగా ముడిపడి ఉందనడంలో సందేహమే లేదు. 
 
పాటతో ప్రజలను రంజింపచేసేందుకే పుట్టారనేలా కళాకారుడిగా ఆయన పయనం సాగింది. ఆయన ఈ లోకాన్ని విడిచి ఏడాది అయినా నేటికీ గానగంధర్వుడి పాటలు, ఆయన ఆత్మీ యత తమతోనే ఉన్నాయని అభిమానులు ఆయన్ను స్మరించుకుంటున్నారు. 
 
దివంగత ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం చనిపోయి నేటికి ఒక యేడాది. తన గానంతో కోట్లాది శ్రోత‌ల‌ని ప‌ర‌వ‌శింప‌జేసిన గానగంధ‌ర్వుడు. గత యేడాది సెప్టెంబరు 25వ తేదీన కన్నుమూశారు. కరోనా వైరస్ సోకిన తర్వాత సుమారుగా రెండు నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 
 
ఈ వార్త‌తో అంద‌రి గుండెలు ప‌గిలాయి. బాలు ఇక మ‌న మ‌ధ్య లేడ‌నే వార్త‌ని ఎవ‌రు జీర్ణించుకోలేక‌పోయారు. నీవు లేకపోయినా.. నీ పాట ఆ చంద్రతారార్కం నిలిచే ఉంటుందంటూ తోటి గాయకులు, సినీ సంగీతాభిమానులు బ‌రువైన గుండెతో క‌న్నీటి వీడ్కోలు ప‌లికారు. బాలు మ‌ర‌ణించి ఏడాది పూర్తైన సంద‌ర్భంగా ఈ రోజు ఆయ‌న సంస్మ‌ర‌ణ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ బాలు జ్ఞాప‌కాలు గుర్తు చేసుకుంటున్నారు.
 
మరోవైపు, తెలుగు, త‌మిళంతోపాటు క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో ప్ర‌ధానంగా ఆయ‌న పాటలు వినిపిస్తాయి. మొత్తంగా చూస్తే 16కుపైగా భాష‌ల్లో ఆయ‌న పాటలు పాడారు. 40,000కుపైగా పాట‌లు పాడి ఆయ‌న గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు.
 
ఆయ‌న కెరీర్ అప్ర‌తిహాతంగా సాగుతున్న వేళ బాలుకి కరోనా సోకింది. ఆగస్ట్ 5, 2020న త‌న‌కు క‌రోనా సోకిందని చెప్పిన బాలు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శుక్రవారం(సెప్టెంబరు 25,2020) మధ్యాహ్నం 1.04 గంటలకు ఆయన తుది శ్వాస విడిచినట్లు ఎంజీఎం హెల్త్‌కేర్ ఆసుపత్రి అధికారికంగా ప్రకటించింది.