బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 20 నవంబరు 2023 (13:36 IST)

హిడింబ ఫేమ్ అశ్విన్ బాబు హీరోగా నూతన చిత్రం ప్రారంభం

Ashwin Babu, Digangana , Apsar
Ashwin Babu, Digangana , Apsar
కథానాయకుడు అశ్విన్ బాబు కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. గంగ ఎంటర్‌టైన్‌ మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్న చిత్రమిది. అప్సర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రముఖ నిర్మాతలు సుధాకర్ రెడ్డి, 'ఠాగూర్' మధు, శిరీష్ రెడ్డి, ఎర్రబెల్లి విజయ్ కుమార్ రావు జ్యోతి ప్రజ్వలన చేశారు. 
 
ముహూర్తపు సన్నివేశానికి 'సోలో బ్రతుకే సో బెటర్' దర్శకుడు సుబ్బు మంగాదేవి కెమెరా స్విచ్ఛాన్ చేయగా 'నాంది' దర్శకుడు విజయ్ కనకమేడల క్లాప్ ఇచ్చారు. 'బింబిసార' దర్శకుడు వశిష్ట తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శక నిర్మాత ఓంకార్ స్క్రిప్ట్ అందజేశారు.
 
చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ''అశ్విన్ బాబుతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. 'హిడింబ' సినిమాతో ఇటీవల ఆయన మంచి విజయం అందుకున్నారు. దాని తర్వాత మరో వైవిధ్యమైన కథతో మా సంస్థలో సినిమా చేస్తున్నారు. కొత్త కథ, కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది. సోమవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నాం. తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతుంది. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో సినిమా చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం'' అని అన్నారు. 
 
అశ్విన్ బాబు సరసన దిగంగనా సూర్యవంశీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో 'హైపర్' ఆది ప్రధాన పాత్రలో నటించనున్నారు.
 
ఈ చిత్రానికి ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : సాహి సురేష్, మ్యూజిక్ డైరెక్టర్ : వికాస్ బడిస, డీవోపీ : దాశరథి శివేంద్ర, నిర్మాత : మహేశ్వర్ రెడ్డి మూలి, దర్శకత్వం : అప్సర్.