ఆదివారం, 3 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 3 నవంబరు 2022 (09:51 IST)

మానసికంగా బలంగా తయారయ్యా, త్వరలోనే సౌత్‌లో సినిమా చేస్తా: జాన్వీ కపూర్

bony-jahnvi
bony-jahnvi
జాన్వీ కపూర్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మిలి’. మాతుకుట్టి గ్జేవియర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు. నవంబర్ 4న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ జరిగింది. 
 
ఈ సందర్భంగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ ‘‘ డైరెక్టర్‌గారు స్టోరి చెప్పినప్పుడు మిలి చిత్రంతో నటిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే అవకాశం ఉందనిపించింది. రోల్ ఛాలెంజింగ్‌గా అనిపించింది. సినిమా చూసిన నాన్న చాలా ఎగ్జయిట్ అయ్యారు. నన్ను, తనని తెరపై చూసుకున్నట్లు అనిపించిందని అన్నారు. మా నాన్నగారితో నేను చేసిన తొలి సినిమా. మాతుకుట్టి సార్‌తో కలిసి నటించటం చాలా లక్కీ అనిపించింది. -18 డిగ్రీల టెంపరేచర్‌లో 22 రోజుల పాటు చిత్రీకరించాం. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ చేయటం చాలా కష్టం. నాన్నగారు నిర్మాతగా ఎలాంటి వ్యక్తో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి మనసున్న నిర్మాత అని అంటుంటారు. ఈ సినిమా సమయంలోనూ అది నిజమని ప్రూవ్ చేశారు. సెట్స్‌కైతే చాలా తక్కువ సార్లు వచ్చారంతే. తన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఇచ్చే సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 
నటిగా 15-16 గంటల పాటు ఫ్రీజర్‌లో ఉండటం అంటే చిన్న విషయం కాదు.. చాలా ఇబ్బంది పడ్డ సందర్భాలున్నాయి. అయితే ఇలాంటి పాత్రలో నటించటం వల్ల మానసికంగా మరింత బలంగా తయారయ్యాను. దక్షిణాది ప్రేక్షకులు మా అమ్మకి, నాన్నకి ఎంత ప్రేమను అందించారో ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. నేను కూడా చాలా రోజులుగా సౌత్‌లో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాను. త్వరలోనే చేసే అవకాశం ఉంది’’ అన్నారు.  
 
సన్నీ కౌశల్ మాట్లాడుతూ ‘‘హైదరాబాద్ ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాాదాలు . మిలి విషయానికి వస్తే థ్రిల్లింగ్ మూవీయే కాదు.. ఇప్పటి వరకు తెరపై చూడని రిలేషన్‌ని ఎలివేట్ చేసే సినిమాగా అనిపించింది. అందుకు బోనీ సార్ అడగ్గానే వెంటనే ఓకే చెప్పేశాను. జాన్వీ, మాతుకుట్టి వంటి వారితో పని చేయటం లక్కీగా భావిస్తున్నాను’’ అన్నారు. . 
 
బోనీ కపూర్ మాట్లాడుతూ ‘‘నేను డైరెక్ట్ చేసిన వాటిలో 14-15 చిత్రాలు హైదరాబాద్‌లో చిత్రీకరించాను. ఇక్కడి వారితో నాకు మంచి అనుబంధం ఉంది. నా సతీమణి శ్రీదేవికి తెలుగు సినిమా ఎలాంటి ఆదరణ చూపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు నా కుమార్తె జాన్వీకి కూడా అదే తరహా ప్రేమాభిమానాలు దక్కుతాయని ఆశిస్తున్నాను.షూటింగ్ చేస్తున్న సమయంలో జాన్వీ, డైరెక్టర్ మాతుకుట్టి ఇద్దరూ అనారోగ్యానికి గురయ్యారు. కానీ షూటింగ్ ఎలా చేయాలనే దానిపై కాంప్రమైజ్ కాలేదు’’ అన్నారు.