శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

ఈ అరుదైన గౌరవం వారిదే : పద్మ విభూషణ్‌పై చిరంజీవి భావోద్వేగం

chiranjeevi
తనకు పద్మ విభూషణ్ పురస్కారం రావడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దీనిపై తన స్పందనను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. తన ఈ స్థితికి లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణమని ఆయన తెలిపాు. తనకు దక్కిన గౌరవం వారిదేనని చెప్పారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చిరంజీవి తన సందేశాన్ని ఓ వీడియో రూపంలో విడుదల చేశారు. 
 
"దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ లభించినందుకు తనకు ఎలా స్పందించాలో తెలియడం లేదని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం లభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా తమ సొంత మనిషిగా, అన్నయ్యగా, బిడ్డగా భావించిన కోట్లాదిమంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబం అండదండలు, లక్షలాదిమంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేడు తాను ఈ స్థితిలో ఉన్నానని, తనకు దక్కిన ఈ గౌరవం వారిదేనని పేర్కొన్నారు. ఈ ప్రేమకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని ప్రశ్నించారు.
 
తన 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై భిన్నమైన పాత్రల ద్వారా వినోదం పంచేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తూనే ఉన్నానని చిరంజీవి పేర్కొన్నారు. నిజజీవితంలోనూ అవసరమైనప్పుడు సమాజానికి తనవంతు సాయం చేస్తూనే ఉన్నానన్నారు. అయితే, తనపై చూపిస్తున్న కొండంత అభిమానానికి తాను ఇస్తున్నది గోరంతేనని చెప్పుకొచ్చారు. ఈ నిజం తనకు ప్రతి క్షణం గుర్తుకు వస్తూ ప్రతిక్షణం ముందుకు నడిపిస్తూ ఉంటుందన్నారు. తనను ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొంటున్నట్టు చిరంజీవి ఆ వీడియోలో పేర్కొన్నారు.