శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (13:05 IST)

'జబర్దస్త్' షో ను మాత్రం వదిలేది లేదు: నాగబాబు

జబర్దస్త్... తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో... ఈటీవీలో అత్యధిక రేటింగులతో కొన్నేళ్లుగా కొనసాగుతున్న జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షోలకి న్యాయనిర్ణేతలుగా నటుడు నాగబాబు, సినీ నటి, ఆర్.కె. రోజా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే... ఈ కార్యక్రమాలు ఇలా నాన్‌స్టాప్‌గా నవ్వులు పూయించడంలో ఈ ఇద్దరి పాత్ర ఎంతగానో ఉందనేది నిర్వివాదాంశం. కాగా... నాగబాబు .. 'జనసేన' పార్టీలో చేరడం .. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం రెండూ జరిగిపోయిన నేపథ్యంలో... నాగబాబు ఇక రాజకీయాలపైనే దృష్టిపెట్టనున్నారనీ, ఆయన జబర్దస్త్' చేయకపోవచ్చుననే ప్రచారం జోరందుకుంది.
 
తాజాగా ఈ విషయంపై స్పందించిన ఆయన.. 'జబర్దస్త్' అంటే తనకు చాలా ఇష్టమనీ.. ఎన్నో సమస్యల నుండి బయటపడటానికి అది తనకు ఎంతగానో ఉపయోగపడుతుందనీ... నెలకి నాలుగు రోజులు మాత్రమే జరిగే షూటింగుల కోసం తాను ఎలాగో అలా సర్దుబాటు చేసుకుంటాను. ఒకవేళ ఎంపీగా గెలిచినప్పటికీ... ఈ షో చేయడం మాత్రం మానుకోననీ.. న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూనే ఉంటాననీ... రాజకీయ రంగంలో ఒకవైపున పదవులు నిర్వహిస్తూనే.. మరో వైపున టీవీ షోలకి న్యాయనిర్ణేతలుగా పని చేసిన... పని చేస్తున్న వాళ్లు చాలామందే ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు.
 
మరి... ఇదే నిజమైతే... బుల్లితెరపై మళ్లీ మెగా బ్రదర్ గారిని చూసేయవచ్చు.