అంగరంగ వైభవంగా నయనతార - విఘ్నేష్ శివన్ వివాహం
లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌లో వివాహం గురువారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 10.20 గంటలకు వధువు మెడలో వేద పండితులు మాంగల్య ధారణ చేయించారు. మహాబలిపురానికి సమీపంలోని వడనెమ్మేలిలో ఉన్న ఓ నక్షత్రహోటల్‌లో ఈ వివాహం జరిగింది. ఈ వేడుకలకు చిత్రపరిశ్రమకు చెందిన అనేక సినీ ప్రముఖులు హాజరై వధూవులను ఆశీర్వదించారు.
కాగా, గత 2005లో హరి దర్శకత్వం వహించిన అయ్య చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన నయనతార గత 17 యేళ్లుగా హీరోయిన్‌గా కొనసాగుతూ లేడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు. అలాగే, గత 2015లో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన నానుమ్ రౌడీదాన్ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అలా గత ఏడేళ్లుగా ప్రేమికులు వీరిద్దరూ గురువారం మూడుముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు.
పెళ్లి ముహూర్తానికి వధూవరులిద్దరూ పట్టు వస్త్రాలు ధరించి కళ్యాణ వేదిక వద్దకు ఉదయం 8.45 గంటలకు చేరుకున్నారు. ఆ తర్వాత వేదపండితులు హిందూశాస్త్రబద్ధంగా ఉదయం 10.20 గంటలకు వధువు మెడలో తాళి కట్టించారు. ఈ పెళ్లి ముహూర్తానికి చిత్ర రంగానికి చెందిన ప్రముఖులు బోనీ కపూర్, రజనీకాంత్, షారూక్ ఖాన్, సూర్య, జ్యోతిక, కేఎస్ రవికుమార్, నెల్సన్, అట్లీ, ప్రియ దంపతులు తదితరులు హాజరయ్యారు.