సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 ఆగస్టు 2021 (11:55 IST)

ఈడీ ఆఫీసులో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ - టాలీవుడ్‌లో ఉత్కంఠ!

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మరోమారు తెరపైకి వచ్చింది. గతంలో అనేక మంది వద్ద హైదరాబాద్ నగర పోలీసులు విచారణ జరిపారు. ఇపుడు మరోమారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరుపనుంది. ఇందులోభాగంగా తొలుత టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను తొలుత విచారణకు పిలిచింది. 
 
మంగళవారం నుంచి మొత్తం 12 మంది సినీ ప్రముఖులను విచారించనుంది. తొలిరోజున దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈ విచారణ కోసం ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉండగా... 10.05 గంటలకే ఆయన వచ్చేశారు. 
 
ఆయనతో మాట్లాడేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా పూరీ జగన్నాథ్ స్పందించలేదు. కారు దిగిన వెంటనే నేరుగా కార్యాలయంలోకి వెళ్లారు. ఈడీ సిబ్బంది ఆయనను నేరుగా మొదటి అంతస్తులోకి తీసుకెళ్లారు. మీడియాను అనుమతించలేదు. 
 
ఇదిలావుంటే, ఈ డ్రగ్స్ కేసులో విచారణ ఎలా కొనసాగనుంది, ఏయే ప్రశ్నలు అడగబోతున్నారు, పూరీ జగన్నాథ్ ఎలాంటి సమాధానాలు ఇవ్వబోతున్నారు అనే విషయాలు ఇప్పుడు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.