శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (17:28 IST)

సందీప్‌ కిషన్‌ మైఖేల్‌ మూవీ ఎలా వుందంటే!

miceal poster
miceal poster
నటీనటులు: సందీప్‌ కిషన్‌, దివ్యాంశ కౌశిక్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌, విజయ్‌ సేతుపతి, అయ్యప్ప పి.శర్మ, అనసూయ భరద్వాజ్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌, అనీష్‌ కురువిల్లా తదితరులు
 
సాంకేతికత: ఛాయాగ్రహణం: కిరణ్‌ కౌశిక్‌, సంగీతం: శ్యామ్‌ సి.ఎస్‌, మాటలు: కళ్యాణ చక్రవర్తి,నిర్మాతలు: భరత్‌ చౌదరి-రామ్మోహనరావు పుస్కూరు, కథ-స్క్రీన్‌ ప్లే-దర్శకత్వం: రంజిత్‌ జయకొడి.
 
ఒకే ఒక్క సినిమా హీరోగా ‘వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్‌’ హిట్‌ కొట్టిన సందీప్‌ కిషణ్‌ ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఆయన్ను మరో స్థాయికి తీసుకెళ్ళలేకపోయాయి. తమిళ సినిమాలు చేస్తున్న ఆయనకు అక్కడ వారితో మంచి సంబంధాలున్నాయి. అందుకే తమిళ దర్శకుడితో ఈసారి మైఖేల్‌ అనే సినిమా చేశాడు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందిన ఈ సినిమా మిగిలిన దక్షిణాది భాషల్లో నేడే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
ఇది 1990నుంచి మొదలైన గ్యాంగ్‌ స్టర్‌ కథ అని ముందుగానే చెప్పేశారు. దానికి తగినట్లుగానే..  తనను అనాథచేసిన తండ్రిని టార్గెట్‌ చేస్తూ ముంబై వస్తాడు మైఖేల్‌ (సందీప్‌ కిషన్‌). ఆ సమయంలో అక్కడ డాన్‌గా ఎదిగిన గురునాథ్‌ (గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌) చేరదీస్తాడు. కొంతకాలానికి గురునాథ్‌ ప్రాణాపాయంలో వుండగా మైఖైల్‌ రక్షిస్తాడు. దాంతో మైఖైల్‌పై గురి ఏర్పడుతుంది. గురునాథ్‌ ఒక్కోక్కరిని చంపుకుంటూ వెళుతూ చివరగా కిల్లర్‌ అయిన గ్యాంగ్‌లోని ఓ వ్యక్తి కూతురిని తీర (దివ్యాంశ)ను చంపమని మైఖైల్‌కు చెబుతాడు. అందుకోసం ఢల్లీి వెళ్ళిన మైఖైల్‌, తీరను చూసి ప్రేమిస్తాడు. ఇక ఆ తర్వాత ఏమయింది? అసలు తన తండ్రికోసం వచ్చిన మైఖైల్‌ ఆ పనిని మర్చిపోయాడా? అనే విషయాలు మిగిలిన సినిమా. 
 
విశ్లేషణ:
 
ముందుగానే  90ల నేపథ్యం.. మాఫియా కథ.. అంటూ చెప్పేయడంతో ఇది గ్యాంగ్‌స్టర్‌ కథ. ఆ కథలన్నీ ఒకే తరహాలో వుంటాయి. మైఖైల్‌లోనూ ప్రత్యేకమైన కథేమీకాదు. ఐదునిముషాలకోసారి యాక్షన్‌ సీన్స్‌ వస్తుంటాయి. హీరో కోసం హైలైట్‌ చేయడానికి సన్నివేశాలే ఎక్కువగా వున్నాయి. ఓ దశలో కెజిఎఫ్‌ ఛాయలు కనిపిస్తాయి. అందులో తన తల్లికోరికను తీర్చడానికి మైనింగ్‌లో వున్న వారిని కాపాడడానికి చేసిన హింసాత్మక సన్నివేశాలు అన్నీ ఇన్నీకావు. మైఖైల్‌లోనూ హింస ఎక్కువగా వుంది. హీరో బాడీ స్థాయి ఓ దశలో సరిపోలేదు అనిపిస్తుంది.  
 
ఏది చేసినా ప్రేక్షకుడు హీరో పాత్రకు కనెక్ట్‌ కావాలి. కానీ ఇందులో అదే లోపించింది. అందుకే రొమాన్స్‌ను కాస్త ఎక్కువగానే చూపించారు. కథలో ఆసక్తికరమైన పాయింట్‌ లేదు. ఇంతోటి సినిమాకు తమిళ దర్శకుడిని ఎంపిక చేసుకోవడం కాస్త ఆశ్చర్యంగానూ అనిపిస్తుంది. మాఫియా సినిమాల్లో కమల్‌హాసన్‌, రజనీకాంత్‌, యష్‌ సినిమాలు చూశాక ఆ స్థాయిలో వుండేలా దర్శకుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ చిత్ర దర్శకుడు రంజిత్‌ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా హీరోతో అదే పనిగా ఫైట్లు మాత్రమే చేయించాడు. దాంతో సన్నివేశాల్లో బలం లేకుండా పోయింది.
 
దర్శకుడు ప్రతిదీ ‘స్టైల్‌’గా ఉండాలని చూసుకున్నాడే తప్ప 90నాటి కథలో ఆహార్యాన్ని ఇతర విషయాలను పట్టించుకోలేదు. విడుదలకు ముందు తన బాడీని మార్చుకోవడానికి తగిన వ్యాయామాలు చేశానని సందీప్‌ చెప్పినా అవేవీ సినిమాలో హైలైట్‌ కాలేదు. కథను దర్శకుడు ఏవిధంగా కొత్తగా వుందని అనుకున్నాడో అందుకు హీరో, నిర్మాతలు ఎందుకు ముందు వచ్చారో అర్థంకాదు. గౌతమ్‌ మీనన్‌ చేసిన సినిమా ‘ముత్తు’ కూడా ఇదే లైన్లో సాగే సినిమానే. గ్యాంగ్‌ స్టర్‌ సినిమాలంటేనే రొటీన్‌గా వుంటాయి. అందుకే రామ్‌గోపాల్‌ వర్మ కూడా రక్తచరిత్ర వంటి వెరైటీ సినిమాలు తీస్తూంటాడు.
 
అయితే విజయ్‌ సేతుపతి పాత్ర కూడా సరైనవిధంగా ట్రీట్‌ చేయలేకపోయాడు. సినిమా ఎటుపయనిస్తోందో అర్థంకాదు. కథలో కొన్ని ట్విస్టులు ఉన్నప్పటికీ రిలీవ్‌ చేసే సమయంలో ఎగ్జైట్‌మెంట్‌ లేకుండా చేశాడు. బిల్డప్‌ ఎక్కువ విషయం తక్కువ అన్నంతగా ఈ సినిమా వుంది. 
 సందీప్‌ కిషన్‌ మైఖైల్‌ పాత్రలో ఓకే అనిపించాడు. చేసింది రౌడీ పాత్రే కానీ.. అందులో స్టైలిష్‌ గా కనిపించాడు. హీరోయిన్‌ దివ్యాంశ అందంగా కనిపించింది. మిగిలిన పాత్రలు ఓకె. వరలక్ష్మి చిన్న పాత్ర.  అనసూయ పాత్ర చాలా సాధారణంగా అనిపిస్తుంది. తన పాత్రకు పెట్టిన డైలాగులు ఓవర్‌ గా అనిపిస్తాయి. అయ్యప్ప పి.శర్మ బాగా చేశాడు.
 
శ్యామ్‌ సి.ఎస్‌. నేపథ్య సంగీతం  బాగానే కష్టపడ్డాడు. కానీ ఆర్‌ఆర్‌ తో అతనిచ్చే బిల్డప్‌ కి.. సన్నివేశాల్లో ఉన్న కంటెంట్‌ కి అసలు సంబంధం లేదు.  కెమెరామన్‌ కిరణ్‌ కౌశిక్‌ పనితనం రిచ్‌గా వుంది. భారీ తారాగణం, నిర్మాణవిలువలు బాగున్నా, సాంకేతిక నిపుణులు వున్నా ప్రేక్షకుడు కనెక్ట్‌కాకపోవడానికి రొటీన్‌ కథగా వుండడమే. సందీప్‌ కిషణ్‌ మాస్‌ హీరో అనిపించుకోవాలని చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ వంటి సాఫ్ట్‌ కథలకే ఆయన సూటవుతాడేమోనని అనిపిస్తుంది. ఇది ఏమేరకు ప్రేక్షకులు ఆదరిస్తారో చూడాల్సిందే.