1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By వసుంధర
Last Modified: శుక్రవారం, 15 అక్టోబరు 2021 (22:11 IST)

ఈ పెళ్లిసందD అలనాటి పెళ్లిసందడిని ఢీ కొట్టిందా? డీలా పడిపోయిందా?

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో కాసుల వర్షం కురిపించింది అలనాటి పెళ్లిసందడి. ఈ చిత్రంలో శ్రీకాంత్ హీరో. ఆయన కుమారుడు తెరంగేట్రం చేస్తూ వచ్చిన సినిమా పెళ్లిసందD. ఈ చిత్రం ఈ రోజు దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ పెళ్లిసందD అలనాటి పెళ్లిసందడిని ఢీ కొట్టిందా.. డీలా పడిపోయిందా అనేది తెలుసుకోవాలంటే చిత్రం కథలోకి వెళ్లాల్సిందే.

 
వశిష్ట (రాఘవేంద్రరావు), బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు ద్రోణాచార్య అవార్డు గ్రహీత. మాయ (శివాని రాజశేఖర్) తండ్రి (రాజేంద్ర ప్రసాద్) అభ్యర్థన మేరకు ఆయన తన కథను వివరించాడు. యువ వశిష్ట (రోషన్) ఒక ప్రతిభావంతులైన బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు. అతడు, అతని తండ్రి (రావు రమేష్) తన వివాహం విషయంలో విభేదించినందున, అతని మామ (షకలక శంకర్) ద్వారా, అతను తన కజిన్ వివాహానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

అక్కడ అతను వధువు స్నేహితురాలు సహస్ర (శ్రీ లీలా)ను చూస్తాడు. షరా మామూలే. ఇద్దరూ మొదట్లో గొడవలు పడ్డారు. కొన్ని క్షణాల తర్వాత ఇద్దరూ ప్రేమలో పడిపోతారు. కానీ ఆమె తండ్రి (ప్రకాష్ రాజ్) కఠినమైన వైఖరిని తీసుకోవడంతో విషయం సంక్లిష్టమవుతుంది. ఇది సహస్రను దిగ్భ్రాంతికరమైన నిర్ణయం తీసుకునేలా చేస్తుంది. ఆ నిర్ణయం ఏంటన్నది తెలుసుకోవాలంటే తెరపై పెళ్లిసందDని చూడాల్సిందే.
 
 
టెక్నికల్ విషయానికి వస్తే... రాఘవేంద్రరావుకు శిష్యుడైన గౌరీ రోనంకి తెరపై రాఘవేంద్రరావు పరిచయంతో ఆసక్తికరమైన రీతిలో కథనాన్ని ప్రారంభించాడు. రోషన్‌ని కథలోకి ప్రవేశపెట్టిన వెంటనే, కథనం చాలా రొటీన్‌గా మారుతుంది. వివాహంలో హీరోలుహీరోయిన్లు వారి పోరాటాలు మొదలైన సన్నివేశాలు అన్నీ మునుపటి చిత్రాలకు, ఒకప్పటి పెళ్లిసందడికి పోలికలు ఉన్నాయి. 

 
ప్రతి సన్నివేశం, ఫ్రేమ్, పాత్రలు చాలా మార్పులేనివిగా, రొటీన్‌గా ఉంటాయి. సంభాషణలు కూడా అలాగే ఉంటాయి. నవ్వించే సన్నివేశాలు కూడా వీక్షకులను నవ్వించడంలో విఫలమవుతాయి. మొత్తం కథపై రాఘవేంద్రరావు స్టాంప్ ఉంది. దాంతో ఇది పాత పెళ్లిసందడి వాసన కొడుతున్నట్లు అనిపిస్తుంది. ప్రతిదానికీ కొత్తదనం లేకపోవడంతో గౌరీ రోనంకి తన కథ, స్క్రీన్ ప్లే, కథనం విఫలమైనట్లు అనిపిస్తుంది. డైలాగులు కాలం చెల్లినవి. 
 
రోషన్ తన పాత్రలో బాగా నటించాడు. కొత్తగా వచ్చిన అతను బాగానే చేసాడు. బాగా డ్యాన్స్ చేశాడు. రొమాన్స్‌లో తన వంతు కృషి చేశాడు. అతను ఇంకా కష్టపడి తన డైలాగ్ డెలివరీని మెరుగుపరచాలి. శ్రీ లీలా అందంగా కనిపించింది. ఆమె రెడ్ హాట్ గ్లామర్ లుక్స్‌తో ఆకర్షిస్తాయి. ఆమె పాటల్లో సెన్సస్‌గా కనిపించింది. బాగా డ్యాన్స్ చేసింది.
 
రాఘవేంద్రరావు తన నటనా అరంగేట్రం చేసి తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకర్షించారు. శ్రీ లీలా, రోషన్‌ల తండ్రిగా ప్రకాష్ రాజ్- రావు రమేష్ తమ పాత్రలను పరిపూర్ణంగా పోషించారు. రాజేంద్ర ప్రసాద్, షకలక శంకర్, వెన్నెల కిషోర్ సరేసరి.
 
పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి, రఘు బాబు, ఝాన్సీ, ఫిష్ వెంకట్ వంటి వారు తమ పరిధి మేరకు నటించారు. కీరవాణి సంగీతం బాగుంది. చాలా మంచి ఫుట్-ట్యాపింగ్ ట్యూన్‌లతో వచ్చాడు. అన్ని పాటలు బాగా చిత్రీకరించబడ్డాయి. తెరపై హీరోయిన్స్ అందాలను పువ్వులు, పండ్లను ఉపయోగించడంలో రాఘవేంద్రరావు మ్యాజిక్ మరోసారి కనిపించింది. సునీల్ కుమార్ నామా సినిమాటోగ్రఫీ బాగుంది. ఇది తెరపై దృశ్యాలను అందంగా తీర్చిదిద్దింది. మొత్తమ్మీద ప్రొడక్షన్స్ వేల్యూస్ బాగున్నాయి.