మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Modified: శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (20:56 IST)

మంత్రి ఈటల ఉద్వాసనకు రంగం సిద్ధం....? కారణం అదేనా?!!

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ను కేబినెట్​ నుంచి తప్పించేందుకు సీఎం కేసీఆర్​ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మెదక్​ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులో సుమారు 100 ఎకరాల భూమి అంశంలో మంత్రి ఈటలపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో అప్పడు కలెక్టర్​గా పని చేసిన ధర్మారెడ్డి పూర్తి వివరాలు, మంత్రి ఈటల ప్రమేయాన్ని సీఎం కేసీఆర్​కు నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం.
 
దాదాపు నాలుగున్నరేండ్ల కిందట ఈ వ్యవహారం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల ఈ భూమికి ఓ రోడ్డు విషయంలో రైతులతో రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై కొంతమంది రైతులు వ్యతిరేకించడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. ఈ భూ వ్యవహారంలో ఈటల రాజేందర్​పై చర్యలు తీసుకుంటూ మంత్రి వర్గం నుంచి ఉద్వాసన పలికేందుకు నిర్ణయం తీసుకున్నట్లు టాక్​. రేపో, మాపో మంత్రి ఈటలను కేబినెట్​ నుంచి తప్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.
 
మరోవైపు మంత్రి ఈటల వ్యవహారం శుక్రవారం సాయంత్రం మీడియాలో వైరల్​గా మారింది. టీఆర్​ఎస్​ పార్టీ అధికారిక ఛానల్​గా గుర్తింపు ఉన్న టీ న్యూస్​లో కూడా ‘‘ఆరోగ్య శాఖ మంత్రికి కబ్జారోగం’’ అంటూ ఇదే అంశాన్ని హైలెట్​ చేసింది. అటు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే పలు ఛానళ్లలో కూడా ఈ వార్త పదేపదే రావడం సంచలనంగా మారింది.