శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 2 మే 2023 (11:06 IST)

ప్రాణాంతక వ్యాధిగా మారిన డెంగీ... వ్యాక్సిన్ కావాలంటున్న సైంటిస్టులు

Dengue
డెంగీ వైరస్ తన రూపు మార్చుకుంటుంది. దీంతో ప్రస్తుతం ఇది ప్రాణాంతక వ్యాధిగా మారింది. ఈ వ్యాధి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడాలంటే అర్జెంటుగా వ్యాక్సిన్ కావాలని సైంటిస్టులు కోరుతున్నారు. తాజాగా జరిగిన ఓ పరిశోధనలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. 
 
భారత్‌లోని డెంగీ వైరస్ కొత్త రూపు దాల్చినట్టు పేర్కొంది. దీన్ని కట్టడి చేయాలంటే తక్షణం ఒక వ్యాక్సిన్ అవసరమని తెలిపింది. గత ఆరు దశాబ్దాలుగా దేశంలో నమోదైన డెంగీ డేటాను విశ్లేషించి ఈ మేరకు వివరాలు వెల్లడించారు.
 
ఈ అధ్యయనంలో పలు సంస్థలు పాలుపంచుకున్నాయి. డెంగీ కేసులు గత 50 యేళ్లుగా నిలకడగా పెరుగుతున్నాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిశోధనలో భాగంగా సైంటిస్టులు డెంగీ వైరస్‌కు చెందిన నాలుగు సీరోటైప్‌లపై అధ్యయనం చేశారు. తమ పూర్వ వేరియంట్లతో పోల్చతే ఈ సీరోటైప్‌లు ఎంత మేర రూపాంతరం చెందుతాయన్నది పరిశోధించారు. ఈ పరిశోధన వివరాలను ఓ సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. 
 
ఐఐఎస్‌సీ పరిశోధకులు భారతీయ డెంగీ స్ట్రెయిన్‌ల నుంచి 408 జెనెటిక్ సీక్వెన్స్‌లను పరిశీలించారు. ఈ సీక్వెన్స్‌లు 1956 నుంచి 2018 మధ్య కాలంలో సేకరించారు. ప్రస్తుతం కొత్తగా రూపాంతరం చెందిన డెంగీ వైరస్‌ను అడ్డుకునేందుకు అర్జెంటుగా వ్యాక్సిన్ కావాలని సైంటిస్టులు అంటున్నారు.