మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 15 మే 2018 (16:37 IST)

కర్ణాటక రాజకీయం.. కాంగ్రెస్ - జేడీఎస్ నేతలకు ముఖం చాటేసిన గవర్నర్

కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మంగళవారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అలాగే, కాంగ్రెస్‌ పార్టీకి 78, జేడీఎస్‌కు 38, ఇతరులు 2 చోట్ల గెలు

కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మంగళవారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అలాగే, కాంగ్రెస్‌ పార్టీకి 78, జేడీఎస్‌కు 38, ఇతరులు 2 చోట్ల గెలుపొందారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, జేడీఎస్‌లు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఇరు పార్టీల నేతలు గవర్నర్‌ వజుభాయ్ వాలాను కలిసేందుకు ఆసక్తి చూపగా, ఆయన అపాయింట్మెంట్ నిరాకరించినట్టు వార్తలు వస్తున్నాయి.
 
గతంలో తమిళనాడులో గవర్నర్‌ సీహెచ్ విద్యాసాగర్ రావును అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయ మంత్రాంగం నడిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సీన్ కర్ణాటకలో రిపీట్ చేయాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్‌కు కొంచెం దూరంలోనే ఆగిపోయిన బీజేపీ... సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది, ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తొలి అవకాశం తమకే కల్పించాలని గవర్నర్ వజుభాయ్ వాలాకు విన్నవించనుంది.
 
మరోవైపు, గవర్నర్‌ను కలిసేందుకు కాంగ్రెస్ పత్రినిధి వర్గం ప్రయత్నించింది. అయితే, వారికి గవర్నర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు కలవడం కుదరదని ఆయన స్పష్టమైన సమాచారాన్ని కాంగ్రెస్ నేతలకు ఇచ్చినట్టు సమాచారం. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడిన తర్వాత, ఎన్నికల కమిషన్ ఇచ్చే సమాచారం ఆధారంగానే తాను నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ చెప్పినట్టు తెలుస్తోంది. గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో వీరు నిరాశతో వెనక్కి వచ్చేశారు. ఈ బృందంలో పరమేశ్వర, మధు యాష్కీలు కూడా ఉన్నారు. 
 
మరోవైపు, కాసేపట్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గవర్నర్‌ను కలిసిన తన రాజీనామా లేఖను సమర్పించారు. ఆ సమయంలో జేడీఎస్‌తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని కోరినట్టు తెలుస్తోంది. అయితే, గవర్నర్ కేంద్రం చెప్పుచేతల్లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. అందువల్ల తొలుత బీజేపీకే అవకాశం ఇవ్వొచ్చన్న ప్రచారం సాగుతోంది. ఎందుకంటే.. గుజరాత్‌కు చెందిన వజుభాయ్ వాలా.. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ కోసం తన సీటును త్యాగం చేశారు. ఆ తర్వాత నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కర్ణాటక గవర్నర్‌గా వజుభాయ్ వాలా నియమితులయ్యారు. అంటే.. పక్కా హిందుత్వవాది కావడమే కాకుండా నరేంద్ర మోడీకి అత్యంత నమ్మకస్తుడు కావడం గమనార్హం.