శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 జనవరి 2021 (22:20 IST)

కాలుతున్న టైర్‌ను ఏనుగుపైకి విసిరేశారు.. మృతి.. నెటిజన్ల ఫైర్.. ఎక్కడ?

కేరళలో కరెంట్ షాక్‌తో ఏనుగులు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడులోని నీలగిరి అటవీ ప్రాంత గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఏనుగుకు కొందరు నిప్పుపెట్టడంతో కాలిన గాయాలతో మరణించింది. ఏనుగుకు నిప్పుపెట్టిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌ అయ్యింది. ఈ దారుణాన్ని నెటిజన్లు ఖండిస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. నీలగిరి, మాసినగుడి గ్రామంలోకి 40 ఏండ్ల అడవి ఏనుగు ఇటీవల ప్రవేశించింది. దీంతో దానిని తరిమేందుకు కొందరు గ్రామస్తులు ప్రయత్నించారు. ఇందులో భాగంగా కాలుతున్న టైర్‌ను ఏనుగుపైకి విసిరారు. అయితే అది ఏనుగు చెవులకు చిక్కుకుంది. కాలుతున్న టైర్‌ మంటలకు తాళలేక అక్కడి నుంచి అడవిలోకి పారిపోయింది.
 
కాగా, తల వెనుక, చెవుల వద్ద తీవ్రంగా కాలిన గాయాలతో పడి ఉన్న ఆ ఏనుగును అటవీ సిబ్బంది గమనించారు. తెప్పకాడు ఏనుగు శిబిరానికి తీసుకెళ్లి చికిత్స అందించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ ఏనుగు ఈ నెల 19న చనిపోయినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఏనుగుకు నిప్పుపెట్టిన ముగ్గురిని గుర్తించి వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఇద్దరిని అరెస్ట్‌ చేయగా మరొక వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.