నిర్మలా సీతారామన్ పద్దుల చిట్టా... ధరలు పెరిగేవి.. తగ్గేవి ఏవి?
లోక్‌సభలో సోమవారం కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ కారణంగా కొన్ని వస్తువుల ధరలు పెరిగినా, తగ్గినా కొన్నింటి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
తాజా బడ్జెట్ మూలంగా ధరల్లో ఎలాంటి మార్పులకు అవకాశం లేని వస్తువుల జాబితాలో బంగారం, వెండి, ఆల్కహాలిక్ ఉత్పత్తుల్లో ఉపయోగించే పానీయాలు, ముడి చమురు, ముడి సోయాబీన్, పొద్దు తిరుగుడు నూనె, ఆపిల్ పండ్లు, బొగ్గు, లిగ్నైట్, యూరియా తదితర ఎరువులు, బఠానీలు, కాబూలీ శనగలు, శనగపప్పు, ముడి పత్తి పెసర్లు, బొబ్బర్లు లాంటి ఇతర ధాన్యాలు ఉన్నాయి.
అయితే, బడ్జెట్‌లో ఊరట కోసం చూస్తున్న సామాన్యుల నడ్డి విరిచింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై సెస్ పేరుతో మరింత భారం వేసింది. అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ పేరుతో పెట్రోల్‌పై రూ.2.5, డీజిల్‌పై రూ.4 సెస్ విధించారు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగనున్నాయి.
అదేసమయంలో బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకుంటామని పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ క్రమంలో బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం ఉంది.
నైలాన్ చిప్స్, నైలాన్ ఫైబర్‌పై కూడా బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించనున్నట్లు పేర్కొన్నారు. దీంతో నైలాన్ దుస్తుల ధరలు తగ్గే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్ల ధరలు, కార్ల విడిభాగాల ధరలు కూడా పెరగనున్నాయి. సోలార్ ఇన్వర్టర్లపై పన్ను పెంపు, ఇంపోర్టెడ్ దుస్తులు మరింత ప్రియం కానున్నాయి.