సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వినాయక చవితి
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 19 ఆగస్టు 2020 (17:36 IST)

గణేష్ చతుర్థి ఆగస్టు 22, ఏం చేయాలి? (Video)

వినాయక చవితి ఈ నెల 22వ తేదీన వస్తోంది. కరోనావైరస్ కారణంగా ఈసారి అందరూ తమతమ ఇండ్లలోనే వినాయక చవితి పండుగ చేసుకోవాల్సిన పరిస్థితి. సమూహాలుగా ఏర్పడితే కరోనావైరస్ విజృంభించే అవకాశం వుంది. కనుక ఎవరి ఇంట్లో వారే పండుగ చేసుకోవడం ఉత్తమం. 
 
గణేష్ చతుర్థి నాడు ఆదిలోక పరమాత్ముడైన విఘ్నేశ్వరుని ప్రార్ధించాలి. ప్రతి కార్య ఆరంభమునకు విఘ్నేశ్వర స్తుతి హైందవ సంప్రదాయమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గణపతి ప్రార్ధనా పద్యములు, సంప్రదాయ శ్లోకాలూ ఎన్నో ఉన్నాయి. కాని తెలుగువారికి అత్యంత పరిచయమున్న ఈ మూడు పద్యములతో గణేశ్వరుని ప్రార్థిస్తే సుఖసంతోషాలతో జీవిస్తారని ప్రతీతి.
 
"తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌ 
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌. 
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై 
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్‌". 
 
"తలచెదనే గణనాథుని 
తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా 
దలచెదనే హేరంబుని 
దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌" 
 
"అటుకులు కొబ్బరి పలుకులు 
చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌ 
నిటలాక్షు నగ్రసుతునకు 
బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌."
 
విఘ్నేశ్వర స్తోత్రములో విద్యార్ధులకు ఉచితమైన పద్యమొకటుంది. ఈ పద్యాన్ని వినాయక చవితి రోజున మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ పఠించినట్లయితే సకలవిద్యలు అలవడుతాయని ప్రతీతి.
 
"తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్ 
ఫలితము సేయవయ్య నిని ప్రార్ధన సేసెద నేకదంత నా 
వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ 
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా!"
 
ఇక వినాయకుని 16 పేర్లతో కూడిన ప్రార్ధనా శ్లోకమును పఠిస్తే సకల సౌభాగ్యములు దరిచేరుతాయని పెద్దల విశ్వాసము:
 
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః 
 
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః 
 
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః 
 
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః 
 
షోడశైతాని నామాని యః పఠే చ్ఛృణుయాదపి 
 
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా 
 
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే..!