శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 9 ఫిబ్రవరి 2019 (17:00 IST)

అద్దె ఇంట్లో ఉంటున్నారా..?

మనిషి నివసించేది ఇల్లు. ఆ గృహమే స్వర్గసీమ. ఇటుక, ఇసుక, సిమెంటు తదితరాలతో కట్టేది ఇల్లు, అయితే అందులో నివసించడానికి మనం ఎప్పుడైతే ప్రవేశిస్తామో అప్పుడే దానిని గృహమని అంటారు. అందుకే మనం ఇల్లు కట్టిన తర్వాత గృహప్రవేశం ఎప్పుడని అడుగుతారు మన పెద్దలు.
 
ఆ గృహాన్ని స్వర్గసీమగా మలచుకోవడానికి మనిషి పడే పాట్లు అన్నీఇన్నీ కాదు. గృహప్రవేశం అయిన తర్వాత అలంకరణలతో నిండిపోతుంది ఇల్లు. ఇల్లు మన సొంతం అయితే అలంకరణలో పూర్తి స్వాతంత్ర్యంతో అలంకరించుకుంటారు. అదే బాడుగ ఇల్లైతే కాస్త ఆనందం సన్నగిల్లుతుంది.

బాడుగ ఇంట్లో అలంకరించుకోవాలంటే ఎప్పటికైనా ఇల్లు ఖాళీ చేయాల్సిందే కదా అని కాస్త నిరాసక్తత చోటు చేసుకుంటుంది. దీంతో డబ్బు ఖర్చు పెట్టాలంటే కాస్త ఆలోచిస్తాం..
 
ఇల్లు స్వంతమైనా కావచ్చు, లేదా బాడుగదైనా కావచ్చు. ఇల్లు ఇల్లే కదా... మనం ఉంటున్న ఇంటిని అలంకరించుకోవడానికి మీనమేషాలు లెక్కించడం ఎందుకో? పట్టణాలలో, మహానగరాలలో ఫ్లాట్ల సంస్కృతి నడుస్తోంది. ఫ్లాట్లలో సామాన్లు తరలించడానికి నానాయాతనలు పడాల్సివస్తుంది.

దీంతో మన వస్తువులెన్నో పగిలి పోవడం, లేదా పాడైపోవడం పరిపాటే. దీనికి సమాధానంగా బాడుగ ఇండ్లను కూడా అందంగా అలంకరించుకోవడానికి కొన్ని చిట్కాలు మీ కోసం. వీటిని మీరు పాటిస్తే బాడుగ ఇల్లు కూడా స్వర్గధామంలా మారుతుందనడంలో సందేహంలేదు. 
 
1. మీరు పడుకునే మంచం, దీవాన్‌, సోఫాలను ఒక పెట్టెలా తయారు చేయించుకోండి. ఇందులో కొన్ని వస్తువులను ఇల్లు మార్చేటప్పుడు భద్రపరచుకోవచ్చు. దీన్ని ఒక ప్రాంతంనుండి మరో ప్రాంతానికి తరలించడానికి ఆస్కారం ఉంటుంది. 
 
2. షోకేస్, డ్రెస్సింగ్ టేబుల్ లాంటివి కొనేటప్పుడు అవి దృఢంగా ఉండేట్లు చూసుకోండి. అవి కాస్త నాజూకుగావుంటే ప్రమాదమే మరి. 
 
3. మీ పిల్లలకు పెయింటింగ్ వేసే అలవాటుంటే వారి కోసం ప్రత్యేకంగా వారి గదిలో ఒక బ్లాక్ బోర్డు ఉంచండి. దానిపై వారు తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించుకోగలరు. 
 
4. ఇంట్లో పనికి రాని వస్తువులను చేర్చుకోకండి. గోడలపై చీలలు (మేకులు) ఎక్కువగా కొట్టకండి.  ఫోల్డింగ్ డైనింగ్ టేబుల్ మీకు ఎంతో శ్రేయస్కరం కాగలదు. బాడుగ ఇండ్లల్లోని అలమారాలలో తలుపులు లేకపోతే వాటికి తలుపులు బిగించుకుని మీరు ఎంచక్కా వాటిని వాడుకోవచ్చు.