అలాంటి లోదుస్తులు స్త్రీలకు ఇబ్బంది పెట్టవచ్చు, మరి ఎలాంటివి తీసుకోవాలి?
లోదుస్తులను కొనేటప్పుడు చాలామంది మహిళలు వాటి రంగు, డిజైన్ గురించి ఆలోచిస్తుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. మహిళలు లోదుస్తులు కొనుగోలు చేసే ముందు వారి యోని గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే కొన్ని లోదుస్తుల మెటీరియల్స్ చాలా కాలం పాటు ధరిస్తే, యోని చుట్టూ దురద, వాపు లేదా తీవ్రమైన వ్యాధికి కారణమవుతాయి. ఇది ఈస్ట్ లేదా యోని ఇన్ఫెక్షన్లకు కూడా కారణం అయ్యే అవకాశం వుంటుంది. కనుక సరైన లోదుస్తులను ఎలా ఎంచుకోవాలో తెలుసుకుందాం.
ప్రతి స్త్రీ శరీరం భిన్నంగా ఉంటుంది. అందుకే కొందరు హిప్‌స్టర్‌లకు ఎంపిక చేసుకుంటారు. మరికొందరు బికినీ కట్ తీసుకుంటారు. ఐతే కొనుగోలు చేసేది సౌకర్యవంతంగా ఉంటుందా లేదా చెక్ చేసుకోవాలి. లోదుస్తుల పరిమాణాన్ని కూడా పరిగణించాలి. చిన్న సైజు లోదుస్తులను ఉపయోగించడం అసౌకర్యంగా అనిపిస్తే, వెంటనే ఆపేయాలి. చిన్న సైజు లోదుస్తులు యోని వాపుకు దారి తీయవచ్చు. ఇది ఇన్ఫెక్షన్లు, మొటిమల సమస్యలను తీసుకురావచ్చు.
లేస్ టైప్ లోదుస్తులు మహిళలను ఆకర్షిస్తాయి. ఐతే వీటిని అప్పుడప్పుడు ధరించవచ్చు. వీటిని ఎక్కువగా ధరిస్తే, దురదగా అనిపించవచ్చు. చర్మంపై ఎర్రటి మచ్చలను కూడా కలిగిస్తుంది. చాలా బిగుతుగా ఉండే లేదా సింథటిక్ ఫ్యాబ్రిక్స్‌తో చేసిన దుస్తులను ధరిస్తే ఇరిటేషన్ ఏర్పడుతుంది. స్వచ్ఛమైన కాటన్‌తో చేసిన లోదుస్తులు ఉత్తమమైనవి. కొంతమంది నైలాన్, పాలిస్టర్, స్పాండెక్స్‌తో చేసిన లోదుస్తులను ధరిస్తారు. కానీ అవి అప్పుడప్పుడు ధరిస్తుండాలి కానీ ఎక్కువగా వాటిని ధరించకపోవడం ఉత్తమం అంటున్నారు.