బుధవారం, 4 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 జులై 2022 (16:05 IST)

కరోనా నుంచి కోలుకున్న రాహుల్ - బ్లూ జెర్సీ ధరించేందుకు తహతహ

klrahul
కరోనా వైరస్ బారినపడిన కేఎల్ రాహుల్ ఇపుడు తిరిగి సంపూర్ణంగా కోలుకుని, మైదానంలో దిగేందుకు తహతహలాడుతున్నట్టు చెప్పారు. తొలుత హెర్నియాకు శస్త్రచికిత్స చేయించుకున్న రాహుల్‌ కోలుకుంటున్నాడనుకున్న వేళ కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే. 
 
దీంతో ఆసియా కప్‌, టీ20 ప్రపంచకప్‌ పోటీల నేపథ్యంలో విండీస్‌తోపాటు జింబాబ్వే పర్యటనలకు రాహుల్‌కు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. ఈ క్రమంలో సాధ్యమైనంత త్వరగా కోలుకుని జట్టుతో కలుస్తానని చెబుతున్నాడు. ఈ మేరకు ట్విటర్‌లో సుదీర్ఘమైన పోస్టు పెట్టాడు. 
 
'అభిమానులకు నా ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై స్పష్టత ఇవ్వడానికే ఈ పోస్టు పెడుతున్నా. గత జూన్‌లో నాకు శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ఆ  తర్వాత జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్ష పొందుతున్నా. విండీస్‌ పర్యటన కోసం సన్నద్ధమవుతున్న తరుణంలో దురదృష్టవశాత్తూ కొవిడ్‌ బారిన పడ్డా. దీంతో మళ్లీ రెండువారాలపాటు వెనక్కి వెళ్లిపోయినట్లు అయింది. 
 
అయితే సాధ్యమైనంత త్వరగా కోలుకుని సెలెక్షన్‌కు అందుబాటులోకి వస్తా. ఎప్పుడైనా సరే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గౌరవంతో కూడుకున్నదే. బ్లూ జెర్సీ ధరించేందుకు ఎక్కువ కాలం వేచి ఉండలేను' అని ట్వీట్‌ చేశాడు. దీంతో  క్రికెట్‌ అభిమానులు కామెంట్ల వర్షం కురిపించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.