వాంఖడేలో జరిగింది సెమీ ఫైనల్ మ్యాచ్ కాదు.. షమీ-ఫైనల్ మ్యాచ్ : సచిన్
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భారత క్రికెట్ జట్టు విజయయాత్ర కొనసాగుతుంది. ఈ టోర్నీలో తొలి లీగ్ మ్యాచ్ మొదలుకుని బుధవారం వాంఖడే వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్ వరకు భారత జట్టు ఒక్క ఓటమి కూడా లేకుండా విజయభేరీ మోగిస్తూ ఫైనల్‌కు చేరుకుంది. అయితే, ఈ టోర్నీలో తొలి నాలుగు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న భారత పేసర్ మహ్మద్ షమీ.. మరో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆ తర్వాత నుంచి మైదానంలో చెలరేగిపోతున్నాడు. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుపై ఐదు వికెట్లు తీసి ఆజట్టును శాసించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌పై 4 వికెట్లు, శ్రీలంకపై 5, బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసి కివీస్ రెక్కలు విరిచాడు.
మ్యాచ్ ఆసాంతం తన ఆధిపత్యం కొనసాగించిన మహ్మద్ షమీపై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇది సెమీ ఫైనల్ మ్యాచ్ కాదనీ.. షమీ ఫైనల్ అంటూ చమత్కరించాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో రాణించిన భారత క్రికెట్ జట్టు సచిన్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపాడు.
కాగా, ఈ ప్రపంచ కప్‌లో షమీ నాలుగు పర్యాయాలు ఐదు వికెట్లు తీసి, ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. మిచెల్ ప్రపంచ కప్ మ్యాచ్‌లలో మూడుసార్లు ఐదు వికెట్లు లేదా అంతకుమించి వికెట్లు సాధించాడు. అంతేకాకుండా, ప్రపంచ కప్ మ్యాచ్‌లలో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ నిలిచాడు. మిచెల్ స్టార్క్ ఇటీవలే ఈ టోర్నీలోనే నెలకొల్పిన రికార్డును అధకమించాడు. మిచెల్ 19 ప్రపంచ కప్ వన్డే మ్యాచ్‌లలో 50 వికెట్లు తీయగా, మహ్మద్ షమీ మాత్రం 17 మ్యాచ్‌లలో ఈ ఫీట్‌ను సాధించాడు.