చరిత్రలో ఏనాడు అందుబాటులో లేని ఎన్నో అవకాశాలు ఇవాళ మహిళలకు అందుబాటులోకి వచ్చాయి. అందుకు ప్రధానమైన కారణం- సాంకేతిక పరిజ్ఞానం. స్త్రీ, పురుషులకు అవకాశాలు సమానంగా అందుతున్నాయి. కానీ కేవలం శరీర బలం శాసిస్తున్న కాలంలో పురుషాధిక్యత చెలామణి అయ్యేది. ఇప్పుడు సాంకేతిక శరీర బలానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, అందరికీ సమానావకాశాలు లభిస్తున్నాయి.
అయినా కుడా, ప్రకృతి సహజంగా వచ్చిన శారీరక అంశాలకే అధిక ప్రాధాన్యం ఇస్తూ, మనం కేవలం జీవితంలోని ఒక అంశానికి మాత్రమే పరిమితం కావలసిన ఈ ప్రత్యేక లక్షణాన్ని దురదృష్టవశాత్తు జీవితంలోని అన్ని కోణాలకు వర్తింపజేస్తున్నాం. జీవితంలో ఎదురయ్యే ప్రతి సందర్భంలోనూ మీరు స్త్రీయా, పురుషుడా అన్న మీమాంస అవసరం లేదు. ఒక మానవునిగా వ్యవహరిస్తే చాలు. అయితే సంస్కృతి, సంప్రదాయాల్లో ఆ విభేదాలను, అనివార్యమైనవిగా భావిస్తూ. బలవంతంగా, పాటిస్తున్నాము. అదే ప్రకృతి సహజం అనుకుంటున్నాం.
ఈ విభేదాలు కేవలం సామాజికమైనవి మాత్రమే. వేలాది సంవత్సరాలుగా ఆచరిస్తున్న ఈ సంసృతి, సంప్రదాయాల సంకెళ్ల నుంచి విముక్తి పొందడానికి స్వయంగా మహిళలే ముందడుగు వేయాలి. ఈ సందర్భంలో స్త్రీలు గుర్తించుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే వారు పురుషుల్లా తయారు కాకూడదు. సాంస్కృతిక, సాంప్రదాయాల భారం నెత్తిన మోస్తున్న కారణంగా, అదే తీరుతో ఆలోచిస్తూ, అన్ని విషయాల్లోనూ పురష స్వభావమే అధికమన్న భావన రానీయకూడదు. నిజానికి, ఈ ఎక్కువ తక్కువలన్న భావనే పురుషాధిక్యతకు నిదర్శనం. జీవన గమనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, ప్రతిదాని సముచిత ప్రాధాన్యత ఉందన్న వాస్తవాన్ని గుర్తించగలుగుతాము.
ఈ భూగోళం మీద పురుషాధిక్యత ఇంతలా ప్రబలం కావడానికి, ఇన్ని వేల సంవత్సరాల మానవ జీవన పోరాటంలో మనుగడకే అధిక ప్రాముఖ్యత ఉండేది. ఆహార సముపార్జన శారీరక బలంపైనే ఆధారపడి ఉండేది. ఎంతో కష్టపడితే కాని కడుపు నిండా ఆహారం లభించేది కాదు. అయితే గడిచిన 50 ఏళ్ళ కాలంలో ఆహార లభ్యత పుష్కలంగా, సమృద్ధిగా అందుబాటులోకి వచ్చింది. ఇపుడు, ఏ సూపర్ మార్కేట్‌లోకి అడుగు పెట్టినా సరే కావసినవన్నీ అతి తేలికగా కొనుక్కుని తెచ్చుకోవచ్చు.
ప్రస్తుతం ఒకప్పటిలా బతకడానికి పోరాడవలసిన అవసరం లేదు. మనుగడ తేలికై, మనం కాస్త విశ్రాంతిగా ఉన్నట్లయితే, స్త్రీ స్వభావం ప్రాదాన్యతను, సంతరించుకుంటుంది. అయితే ఆధునిక సమాజాలు ఆ రకంగా విరామం తీసుకోవడం లేదు. పోరాట స్వభావాన్ని వదులుకో లేకపోతున్నాము. అది కారు నడపడంలో అయినా, ఇంటి పరిసరాల్లో అయినా, మరెక్కడైనా, ఆ పరిమితులను పాటిస్తునే ఉన్నాము.
ఈ రోజు ఈ ప్రపంచాన్ని ఆర్థికత పాలిస్తున్నది. డబ్బు మాత్రమే ప్రధానం కావడంతో సామాజిక వ్యవస్థలో పురుషుల పోరాట స్వభావమే ఆధిక్యత వహిస్తుంది. మనం మళ్లీ అదే మూర్గాన్ని అనుసరిస్తున్నాం. రకరకాలుగా స్త్రీ స్వభావం మరుగున పడిపోతుంది. ఈ ధోరణి పాశ్చాత్య దేశాల్లో మరీ ఎక్కువుగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా దాని ప్రభావం ఇటీవల కనిపిస్తోంది.
కేవలం ఆడ, మగ అన్న అర్థంలో కాకుండా రెండు ప్రధాన గుణాలు ఆధారంగా వారి విశిష్టతలను తెలుసుకుందాం. ఎందుకంటే కొందరు స్త్రీలు పురుషులను మించిపోతుండగా, మరికొందరు మగవారు ఆడ వారితో పోల్చదగిన వారుగా ఉంటున్నారు. స్త్రీత్వం వికసించాలంటే, సర్వత్రా వ్యాపించాలంటే, మన చుట్టూ ఉండే సమాజంలో జీవితంలోని అన్ని వ్యవహారలలో విలువలుకు ప్రాధాన్యం ఇవ్వటం అవసరం. సంగీత, కళలు, ప్రేమ, ఆలన, పాలన, లాటివి ఆర్థిక వ్యవహారాలలాగానే ప్రధానమైనవి.
అలాంటి వాటిలో పురుషులకన్నా స్త్రీలకే ఎక్కువ బాధ్యత. వాటా ఉంటుంది. ఇంటిలో కాని, సామాజిక రంగాల్లో కాని, దేశ ప్రయోజనాల్లో కాని మొత్తం మానవ జీవనంలో కాని సమగ్రత రావాలంటే స్త్రీత్వానికి తగిన స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ అవకాశాలు అందించడం అవసరం. ఇది మీ చుట్టూ ఉన్న ప్రతి జీవితంలో సమాజంలో స్పష్టంగా కనిపించేలా చూడవలసిన బాధ్యత అందరిపైనా ఉంది. అలా కాని పక్షంలో మన జీవితాలు అసమగ్రంగానే ఉండిపోతాయి.
లోటుపాట్లు అలాగే కొనసాగుతాయి. ఇవాళ అందరూ భారీ ఆశలతో జీవిస్తున్నారు. విజయ సాధనే ముఖ్యమనుకుంటున్నారు. అది ఒక విధంగా మూర్ఖ పద్దతి. ఆశ మంటల్లో రగిలిపోకుండా గెలుపు సాధనకు అనేక మార్గాలున్నాయి. మీ చుట్టూ ఉన్న అన్నింటిని గురించి శ్రద్ధ ఉంటే, మీరు సహజంగా చేయగలిగినందతా చేస్తారు. తక్కువ చేయరు. అదీ ఒక మహిళ పనిచేసే తీరు.
ఈ ప్రపంచంలో వ్యవహరించవలసిన అత్యుత్తమ విధానం అదే. వ్యక్తిగత ఆశలతో మీరు పని చేసినపుడు, మీరెన్నో గొప్పగొప్ప పనులు చేయవచ్చు కాని అది మీ సంక్షేమం కోసమో అందరి ప్రయాజనాల కోసమో కావాలనిలేదు. ప్రస్తుతం ప్రపంచంలో అందరి దృష్టిలోనూ పడిన గ్లోబల్ వార్మింగ్ (పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు) అడ్డూ అదుపూ లేని మానవ కార్యకలాపాలు ప్రభావమే. ఇదేవిదంగా, మన చుట్టూ జరుగుతున్న వాటిని పట్టించుకోకుండా... మానవుల కార్యక్రమాలు కొనసాగితే, స్త్రీలు కాని, పురుషులు కాని ఎవ్వరూ మిగలరు.
స్త్రీ వ్యవహార శైలికి సంపూర్ణమైన ఆదరణ లభించినట్లయితే, స్టాక్ మార్కెట్ 20,000 స్థాయికి చేరుకోక పోయినా, అందరూ ఆనందంగా ఉంటారు. అందరి ముఖాల్లో మరింతగా నవ్వులు పువ్వులు కనిపిస్తాయి. పరస్పరం మరింతగా ప్రేమాభిమానాలు చూపించగలుగుతారు. జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. వాస్తవానికి మనం చేపట్టే ప్రతి చిన్నపని కూడా సమస్త మానవాళి సంక్షేమం కోసమే కదా? కాని దాన్ని పూర్తిగా మరిచిపోయాం.
అదే పురష స్వభావం, ఒకే చూపు... అది ఒక మార్గంలో అడుగులు వేయడమే పరిసరాలను గమనించే లక్షణం ఉండదు. అదే ఒక మహిళ స్వభావం అయితే అది ఎక్కడికో వెళ్ళకనే తాను ఉన్న పరిస్థితి లోనే ఆనందంగా ఉంటుంది. ఈ రెండు భిన్న ధోరణులను సమతూకంలో నిలబెడితే, మన ప్రగతి ఉంటుంది. అలాగే పూర్తి సంతోషాన్ని అనుభవించగలుగుతాం. ఇప్పుడు ఈ ప్రపంచానకి కావలసింది అదే!