శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : శనివారం, 30 నవంబరు 2019 (20:07 IST)

ఇంద్రియాలకు బుద్ధి చెప్పనివాడు ఇలా అవుతాడు

విజయ మార్గంలో ప్రయాణించాలని అనుకునే వ్యక్తికి ఇంద్రియాలపై పట్టు చాలా అవసరం. దీని ద్వారా మాత్రమే విజయాన్ని సాధించగలుగుతాడు. కళ్లు, చెవులు, నాలుక, ముక్కు, స్పర్శ అనేవే ఐదు జ్ఞానేంద్రియాలు. వీటి ద్వారానే మనం జ్ఞానాన్ని సంపాదిస్తాం. బుద్ధితో మనిషి మనస్సును నిగ్రహించి ఈ ఐదు ఇంద్రియాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించాలి. విద్యార్ధులు ఈ విషయాన్ని చాలా శ్రద్ధగా గమనించాలి. ఈ ఐదింటిలో ఏదైనా సరే దానికి ఇష్టమైన దానిపట్ల మరీ అనురక్తమైతే, దానికి మనస్సు తోడైతే యువత తమ లక్ష్యాన్ని సాధించలేరు.
 
చదువుకోవాల్సిన విద్యార్ధి కళ్లు స్మార్ట్ ఫోన్లో వీడియోల పట్ల, చెవులు సినీ సంగీతం పట్ల, నాలుక బర్గర్ల వంటి ఫాస్ట్‌ఫుడ్ల మీద, ముక్కు అత్తర్ల పట్ల, స్పర్శా సుఖం స్త్రీ సాంగత్యం పట్ల ఆకర్షితమైతే చదువు మీద ధ్యాస ఎట్లా నిలుస్తుంది. మనిషి పతనం చెందడానికి ఐదు ఇంద్రియాలు వాటివాటి ఇష్టాల పట్ల ఆకర్షితం కానక్కరలేదు. అతని పతనానికి ఒక్క ఇంద్రియం పట్టుతప్పినా చాలు.
 
సముద్రంలో నడుస్తున్న నావను తీవ్రమైన గాలి ఏవిధంగా ఒక ప్రక్కకు తోసివేస్తుందో అదే విధంగా ఒక్క ఇంద్రియమైనా చాలు విధ్యార్ధి పతనానికి చేరుస్తుంది. నీటిలోని నావను తీవ్రమైన గాలి తోసివేసి నట్లుగా, మనస్సు లగ్నమైనప్పుడు ఇంద్రియాలలో ఒక్కటైనా సరే మనిషి బుద్ధిని హరిస్తుంది. తదస్య హరతి ప్రజ్ఞాం అనే మాటను విధ్యార్ధులు, యువత పదేపదే గుర్తు చేసుకోవాలి. ఒక్క ఇంద్రియమైనా చాలు, అది బుద్ధిని హరిస్తుంది. అందుకే ఇంద్రియాలు పట్టుతప్పుతాయి. ఎప్పుడూ జాగరూకుడువై ఉండు అంటూ గీత హెచ్చరిస్తుంది.
 
కోతుల వంటి ఇంద్రియాలకు మాటిమాటికి బుద్ధి చెబితేనే, వాటిని అదుపు చేస్తేనే విజయపథంలో అవరోధాలు తొలగిపోతాయి. ఇదే విద్యార్థులకు, యువతకు భగవద్గీత ఇచ్చే సందేశం.