సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2020 (17:28 IST)

ఐపీఎల్ 2020 : అగ్రస్థానం కోసం ఆరాటం... ఢిల్లీ వర్సెస్ బెంగుళూరు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ పోటీలు యూఏఈ వేదికగా రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ పోటీలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రేక్షకులను అనుమతించకపోయినప్పటికీ... పోటీలు మాత్రం హోరాహోరీగా సాగుతున్నాయి. ఫలితంగా మంచి వ్యూవర్ షిప్‌ను సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి మరో కీలక మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్స్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల 19వ లీగ్ మ్యాచ్ జరుగనుంది.
 
ఈ రెండు జట్లూ ఐపీఎల్‌ 2020 పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం పోటీపడుతున్నాయి. నాలుగు మ్యాచుల్లో మూడేసి విజయాలు సాధించిన విరాట్‌ కోహ్లీ, శ్రేయాష్‌ అయ్యర్‌ జట్లు సోమవారం జరిగే మ్యాచ్‌లో విజయంతో అగ్రస్థానంపై కన్నేశాయి. ఇరు జట్లూ ఫామ్‌లో ఉండటంతో దుబాయ్ వేదికగా రసవత్తర పోరు సాగనుంది. 
 
ఇకపోతే, మొదటి మూడు మ్యాచ్‌లలో పేలవ ప్రదరర్శనతో విమర్శలను ఎదుర్కొన్న బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ గత మ్యాచ్‌లో అర్థ సెంచరీ సాధించి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. అజేయ అర్థ సెంచరీతో సత్తా చాటాడు. ఫామ్‌లోకి వచ్చిన విరాట్‌ కోహ్లిని ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లు ఆప గలరా? లేదో వేచి చూడాల్సిందే. అలాగే, దేవ్‌దత్‌ పడి క్లక్‌, అరోన్‌ ఫించ్‌, ఏబీ డివిలియర్స్‌లూ పరుగుల వేటలో జోరుమీదున్నారు. మణికట్టు స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ను ఎదుర్కొవటం అయ్యర్‌ గ్యాంగ్‌కు నేడు కఠిన సవాల్‌ కానుంది.
 
ఇకపోతే, క్లాస్‌ బ్యాట్స్‌మన్‌ శ్రేయాష్‌ అయ్యర్‌ షార్జాలో మాస్‌ ఇన్నింగ్స్‌తో రఫ్ఫాడించాడు. యువ ఓపెనర్‌ పృథ్వీ షా సీజన్‌లో రెండు అర్థ సెంచరీలు సాధించాడు. సహజ శైలిలో విరుచుకుపడే షాను నిలువరించటం అంత సులువు కాదు. సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. 
 
షిమ్రోన్‌ హెట్‌మయర్‌, రిషబ్‌ పంత్‌లు టచ్‌లోకి వచ్చినా.. భారీ ఇన్నింగ్స్‌లు బాకీ పడ్డారు. యువ ఉత్సాహంతో ఉరకలేస్తోన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ నేడు దుబారులో దుమ్మురేపాలని చూస్తోంది. మరి విరాట్‌ బృందం అందుకు అడ్డుపడుతుందా? ఆసక్తికరం.
 
కాగా, ఇరు జట్లూ ఇప్పటివరకు మొత్తం 23 సార్లు తలపడ్డాయి. ఇందులో ఢిల్లీ ఎనిమిదిసార్లు, బెంగుళూరు జట్టు 14 సార్లు విజయం సాధించాయి. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. బెంగుళూరు జట్టు అత్యధికంగా 215 పరుగులు చేయగా, ఢిల్లీ జట్టు 194 పరుగులు చేసింది. అలాగే, బెంగుళూరు జట్టు చేసిన అతి తక్కువ పరుగులు 147 కాగా, ఢిల్లీ జట్టు కేవలం 95 పరుగులకే చాపచుట్టేసింది.

 
తుది జట్లు (అంచనా)
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ : దేవ్‌దత్‌ పడిక్కల్‌, అరోన్‌ ఫించ్‌, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), ఏబీ డివిలియర్స్‌ (వికెట్‌ కీపర్‌), గుర్‌కీరత్‌ సింగ్‌, శివం దూబె, ఇసురు ఉదాన, వాషింగ్టన్‌ సుందర్‌, నవదీప్‌ సైని, ఆడం జంపా, యుజ్వెంద్ర చాహల్‌.
 
ఢిల్లీ క్యాపిటల్స్‌ : పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌, శ్రేయాష్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), షిమ్రోన్‌ హెట్‌మయర్‌, మార్కస్‌ స్టోయినిస్‌, హర్షల్‌ పటేల్‌, అశ్విన్‌, కగిసో రబాడ, అమిత్‌ మిశ్రా, ఎన్రిచ్‌.