మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 10 ఏప్రియల్ 2019 (12:10 IST)

చెరకు తోటలో పని చేయాలంటే.. మహిళలకు గర్భసంచి వుండకూడదు..

మహారాష్ట్రలోని చెరకు తోటలో పనిచేసే మహిళల గర్భాశయాలను తొలగిస్తున్నారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా ప్రజలకు వ్యవసాయమే ప్రధాన వృత్తి. జిల్లాలోని పలు గ్రామాల్లో చెరకు సాగుబడి చేస్తున్నారు. మహిళలతో పాటు చాలామంది ఈ చెరకుతోటలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇలా చెరకు తోటలో పనిచేసే మహిళలకు గర్భాశయాలను తొలగించడం జరుగుతోందని తెలియవచ్చింది. 
 
నెలసరి కారణంగా మహిళలకు ఏర్పడే సమస్యల కారణంగా.. శారీరకంగా తీవ్రంగా శ్రమించడం కష్టతరమవుతుంది. ఇంకా నెలసరి సమయాల్లో మహిళలకు విశ్రాంతి అవసరం కావడంతో.. చెరకు తోటలో పనిచేసే మహిళలు గర్భాశయాలను తొలగించాక పనిలోకి రావాలని చెరకు తోట యజమానులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. 
 
గర్భసంచితో కూడిన మహిళలకు చెరకు తోటలో పనిచేసేందుకు వీల్లేదని షరతు విధిస్తున్నట్లు కూడా వెల్లడి అయ్యింది. ఈ మేరకు హాజీపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ తమ గ్రామంలో గర్భాశయం కలిగి వుండే మహిళను చూడటం అరుదు అని వాపోయింది. చెరకు తోటలో పని కోసం మహిళలు కూడా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపట్లేదని.. గర్భాశయాన్ని తొలగించుకుని పనుల్లోకి వెళ్తున్నారని చెప్పింది. 
 
వంజరవాడి అనే గ్రామంలో 50శాతం మహిళలు గర్భాశయాలను తొలగించుకున్నారని పరిశోధనలోనూ తేలింది. నెలసరి కారణంగా ఆరోగ్య సమస్యలు ఏర్పడటం.. ఇంకా గ్రామాల్లో మహిళలకు తగిన బాత్రూమ్‌లు లేకపోవడం కారణంగా గర్భాశయాలను తొలగించుకుంటున్నారని మహిళా సంఘాలు వెల్లడించాయి.