శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 26 జూన్ 2015 (14:02 IST)

'నాట్స్ సంబరాలు 2015': అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్న ఎనహెం కన్వెన్షన్ సెంటర్...

అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో గల ఎనహెం కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 2, 3, 4 తారీఖులలో 'నాట్స్ సంబరాలు 2015'కి పనులు చురుగ్గా జరుగుతున్నాయని వేడుకలను నిర్వహించే చైర్మన్ రవి ఆలపాటి అన్నారు. నాట్స్ సంబరాలలో పాల్గొనేందుకు ఇప్పటికే 6000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారిని కలిపితే 10,000 మందికి పైగా దాటగలరని రిజిస్ట్రేషన్ కమిటీ డైరెక్టర్ రామ్ యలమంచిలి తెలిపారు. 
 
జూలై 2వ తేది రాత్రి, డోనార్స్ మరియు సంబరాలకు వచ్చే అతిథులకు ప్రతిష్టాత్మకమైన సంబరాలు బ్యాన్క్వెట్ ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగిపోతున్నట్టు బ్యాన్క్వెట్ డైరెక్టర్ మోహన్ కాట్రగడ్డ అన్నారు. నలభీములను మరిపించే వంటవాళ్ళతో, నోరూరించే ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల వంటకాలను సంబరాలకు వచ్చే అతిథులకు, స్నేహితులకు, సన్నిహితులకు అందిస్తామని సంబరాలు ఫుడ్ డైరెక్టర్ కిషోర్ గరికపాటి ధీమా వ్యక్తపరిచారు.
 
ఎనహెం కన్వెన్షన్ సెంటర్‌‌లోని 3,50,000 చదరపు అడుగులను ముస్తాబు చెయ్యటానికి, ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల నుండి ఒక పల్లెటూరి వాతావరణం, ఒక పెళ్లి పందిరిని, శిల్పారామంలను మరిపించే అలంకరణ సామాగ్రిని, కన్వెన్షన్ సెంటర్ దగ్గర కావలసిన బ్యానర్స్‌ను తెప్పిస్తున్నట్లు సంబరాలు ఆపరేషన్స్ డైరెక్టర్ మధు బోడపాటి వివరించారు.
 
సంబరాలకు వచ్చే అతిథులకు, డోనార్స్‌కు ఆతిథ్యం వహించటానికి, వారి ప్రయాణ సౌకర్యాలకు దాదాపు 120 మంది వాలంటీర్స్ సిద్ధంగా ఉన్నారని, ఎనహెం హిల్టన్ హోటల్‌లో వారికి బస ఏర్పాట్లు జరిగిపోయాయని సంబరాలు హాస్పిటాలిటీ డైరెక్టర్ వంశి మోహన్ గరికపాటి తెలిపారు. ఆద్యంతం ఉత్సాహంగా సాగిపోయిన ఆటల పోటీలకు, ఫైనల్స్ వచ్చే వారాంతరంలో నిర్వహిస్తామని సంబరాలు స్పోర్ట్స్ డైరెక్టర్ జైపాల్ రెడ్డి ప్రకటించారు.
 
నాట్స్ నవరసాలు, స్వర సంగమం, నీరాజనాలు, మాయాబజార్, నాట్స్ అష్టావధానం, తారలు దిగివచ్చిన వేళ, వేమన సుమతి భావం, అన్నమయ్య గానామృతం, కామెడీ స్పెషల్, తరతరాల అమరావతి, ఆముక్తమాల్యద కూచిపూడి నృత్యం, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ మానియా, జానపద గానాలు నృత్యాలతో అందరినీ అలరించటానికి సర్వం సిద్ధం అని సంబరాలు కల్చరల్ డైరెక్టర్ డాంజి తోటపల్లి చెప్పారు.
 
మీ ఐడియాకి మా పెట్టుబడి అనే ఆలోచనతో బిజినెస్ సింపోసియం టీం వారు ''షార్క్స్ అండ్ డ్రీమర్స్'' అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దాదాపు నాలుగు మిలియన్ డాలర్స్‌తో వ్యాపారవేత్తలు ఉత్సాహంగా ముందుకు వచ్చారని, 40కు పైగా బిజినెస్ ప్రపోసల్స్ వచ్చాయని సంబరాలు బిజినెస్ సింపోసియం డైరెక్టర్ గిరి కల్లూరి ఆనందం వ్యక్తపరిచారు. సంబరాలకు వచ్చే యువతీ యువకులకు ప్రత్యేకంగా యూత్ కన్వెన్షన్, యూత్ బ్యాన్క్వెట్, క్రూజ్ అని వెరైటీ కార్యక్రమాలు అన్ని సిద్ధంగా ఉన్నాయని యూత్ కన్వెన్షన్ డైరెక్టర్ మధు వివరించారు. 
 
సమాజ సేవే గమ్యంగా ముందుకు సాగిపోతున్న నాట్స్‌కు, సంబరాలలో భాగంగా ఫుడ్ డ్రైవ్‌తో పాటు రక్తదాన శిబిరాలను ఏర్పాటుచేసి అమెరికన్ రెడ్ క్రాస్ నుండి ప్రశంసలు పొందింది సంబరాలు టీం. సంబరాలు కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్ ఉష మాట్లాడుతూ, రక్తదానం, ఫుడ్ డ్రైవ్ లాంటి కార్యక్రమాలకు ముందుండి నడిపించి, ఆ అవకాశాన్ని తనకు అందించిన నాట్స్‌కు అభినందనలు తెలియచేశారు.
 
ఆధ్యాత్మికత కార్యక్రమాలలో భాగంగా సీతావలోకనం, విశ్వరూపిణి సందర్శనం, భక్తి భరిణి మరియు ఆధ్యాత్మిక ప్రవచనాలతో మీ ముందుకు వస్తుంది సంబరాలు 2015 ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చిన్మయ మిషన్ ప్రవక్తలతో పాటు, కొండవీటి జ్యోతిర్మయి, పారుపల్లి రంగనాథ్, విశ్వ జి మరియు తనికెళ్ళ భరణి ప్రవచనాలు అందిస్తారని, చాగంటి కోటేశ్వరరావుచే వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రవచనం ఉంటుందని అని స్పిరిట్యువల్ టీం డైరెక్టర్ శ్రీనివాస్ శీలం ప్రకటించారు.
 
సమైక్య ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత జరుగుతున్న మొదటి సంబరాల వేడుకలలో, ప్రవాసాంధ్రులు పురోగతికి పాటుపడుతున్న ఇరు రాష్ట్రాలకు ఎలా సహాయపడాలో, తమ ఆలోచనలను, నైపుణ్యాన్ని ఎలా అందించగలమో, ఇరు రాష్ట్రాల నాయకులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. ఇప్పటికే సంబరాలకు సోషల్ మీడియాలో విశేష స్పందన వస్తుందని, ప్రింట్ మీడియా, టీవీ చానల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని, ఆద్యంతం ఆసక్తికరంగా సంబరాలు 2015 ఉంటుందని పబ్లిసిటీ, మార్కెటింగ్  మరియు ఏపీ అండ్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోం డైరెక్టర్ కృష్ణ కిషోర్ మల్లిన వివరించారు.
 
సంబరాలకు సర్వం సిద్దం అంటూ 500 మందికి పైగా వాలంటీర్స్ సిద్ధంగా ఉన్నారని, లాస్ ఏంజెల్స్‌కు ఖండాంతరాలలో ఉన్న తెలుగు వారందరినీ ఆహ్వానిస్తున్నామని సంబరాలు 2015 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట్ ఆలపాటి పిలుపునిచ్చారు.