ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. వ్యక్తిత్వ వికాసం
Written By CVR
Last Updated : బుధవారం, 5 ఆగస్టు 2015 (15:47 IST)

టీనేజర్లలో తెలియని ఆందోళన..? ఇలా చేస్తే సరి..

టీనేజ్ అమ్మాయిలు అంటేనే నవ్వులు చిందిస్తూ, తుళ్లుతూ, అందరినీ ఆటపట్టిస్తూ ఎంతో చలాకీగా కనిపిస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో టీనేజర్లు  ఏదో టెన్షన్‌గా ఫీలవుతూ, ఆందోళనగా కనిపిస్తున్నారని పలువురు తెలుపుతున్నారు. ఈ యంగ్ ఏజ్‌లో అమ్మాయిలు తీవ్ర ఒత్తిడి, మానసిక ఆందోళనకు గురవుతున్నారంటే అందుకు ముఖ్యకారణం వాళ్లు ప్రతి చిన్న విషయానికీ అతిగా ఆలోచించడమేనని మానసిక వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
 
అటువంటి వారు ఆనందం, ఉత్సాహం, బాధ.. ఏది కలిగినా దాన్ని పట్టలేరని, భావోగ్వేగాల్ని అదుపులో ఉంచుకోలేనప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. జీవితం అన్నాక మంచీ చెడూ, ఆనందం - విషాదం వంటివి సహాజమనే కదా అనుకుని, వాటిని అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. 
సమస్య చిన్నది కావచ్చు,  పెద్దది కావచ్చు, మీకు మీరే తీవ్రంగా ఆలోచించి భయపడటం వల్ల ఏం ప్రయోజనం లేదంటున్నారు. ఆందోళనతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల మరిన్ని చిక్కుల్లో పడే అవకాశం ఉందని అంటున్నారు. అలాకాకుండా ఆ విషయాన్ని అమ్మకో, నాన్నకో, స్నేహితురాలికో చెప్పి చూడండి. కచ్చితంగా మీకు ఓ మంచి మార్గం దొరుకుంది.
 
కొన్ని సందర్భాలలో తెలియని ఆందోళన, ఒత్తిడి ఏర్పడుతుంది. అటువంటి సమయాల్లో మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అనిపిస్తుంది. అయితే అది సహజమేనని గుర్తించండి. అసలు ఏం కావాలీ, ఏం కోరుకుంటున్నారన్న విషయంపై స్పష్టత తెచ్చుకోండి. అవతలి వారు మీ మాటను పట్టించుకోవడం లేదనుకోవడం కంటే, మీరు ఆ విషయాన్ని వాళ్లకి అర్థమయ్యేంత బాగా చెప్పలేకపోయారని అనుకోండి. మీ మాటల్ని ఎవరూ సమర్థించకపోవడానికి ఇతర కారణాలేమైనా ఉన్నాయా అని సానుకూల దృక్పథంతో ఆలోచించండి.
 
యంగ్ ఏజ్ అమ్మాయిల్లో ఒత్తిడికి ప్రధాన కారణం ఆత్మన్యూనతే ప్రధాన కారణం. ఏ విషయంలోనైనా పోటీతత్వం ఉండాలి. కానీ అది ఆరోగ్యకరంగా ఉండాలన్న ప్రాథమిక నియమాన్ని మరిచిపోవద్దు. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే అవతలి వారు విజయాలను చూసినప్పుడు, వారి నుంచి ఏం నేర్చుకోవాలా అని ఆలోచించాలి. ఆ మాత్రం ఎవరైనా చేయగలరు అని తీసిపారేసి వాళ్లను తక్కువ చేసి చూపే ప్రయత్నం వల్ల ప్రయోజనం ఏమాత్రం ఉండదు. సమయం వృథా అవడం తప్ప. దీనివల్ల విజయానికి మరింత వెనుకబడతారు. ఫలితంగా ఒత్తిడికి లోనవుతారు.