శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్

తిరుమల శ్రీవారి పుష్కరిణి మూసివేత.. ఎందుకో తెలుసా?

కలియుగదైవం కొలువైవున్న తిరుమలలో శ్రీవారి పుష్కరిణి పూర్తిగా మూసివేశారు. పుష్కరిణికి అన్ని వైపులా ఉన్న గేట్లకు అధికారులు తాళాలు వేశారు. దీంతో తిరుమలకు వచ్చే భక్తులు పుష్కరిణిలో స్నానాలు చేసేందుకు వీలులేదు. 
 
ప్రతి యేటా వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు ఆగస్టులో పుష్కరిణిని మూసివేసి కోనేరులోని నీటిని మార్చడం ఆనవాయితీ. అయితే, ఈ యేడాది నీటి ఎద్దడి కారణంగా పుష్కరిణి శుభ్రత పనులను వాయిదా వేశారు. తాజాగా, ఈ ప్రక్రియను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు ప్రారంభించారు. 
 
నిల్వ ఉన్న మురుగునీటిని పైపుల ద్వారా నీటిశుద్ధి కేంద్రాలకు తరలించారు. నెల రోజులపాటు పుష్కరిణి శుద్ధి పనులు కొనసాగనున్నాయి. పుష్కరిణి అడుగుభాగం, మెట్లను పూర్తిగా శుభ్రం చేస్తారు. పాచి, చెత్తాచెదారాన్ని తొలగించి రంగులు వేస్తారు. అనంతరం 23 లక్షల గ్యాలెన్ల నీటితో పుష్కరిణిని నింపుతారు. 
 
ఈ పనులన్నీ పూర్తయిన అనంతరం వచ్చే నెల 6న పుష్కరిణిని పునఃప్రారంభిస్తారు. ఈ పనుల కారణంగా సాయంత్రం ఊరేగింపు సమయంలో ఉత్సవర్లకు సమర్పించే పుష్కరిణి హారతిని కూడా రద్దు చేశారు. పుష్కరిణి మరమ్మతులు పూర్తయ్యే వరకు భక్తులు స్నానపు గదుల్లోనే స్నానమాచరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.