శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 3 జులై 2021 (15:05 IST)

టిటిడి కౌంటర్ల నిర్వహణ టెండర్లు పార‌ద‌ర్శ‌కంగా జ‌రిగాయి: అద‌న‌పు ఈవో ధర్మారెడ్డి

టిటిడి కౌంటర్ల నిర్వహణ టెండర్ల‌లో అవకతవకలు జరిగాయని కొంద‌రు అస‌త్య ప్రచారం చేస్తున్నార‌ని, దాదాపు 18 నెల‌ల కాలంలో ఐదు సార్లు వృత్తి నిపుణ‌త క‌లిగిన ఏజెన్సీల నుండి టెండ‌ర్లు ఆహ్వానించి టిటిడి నిబంధ‌న‌ల మేర‌కు పార‌ద‌ర్శ‌కంగా ఎంపిక చేసిన‌ట్లు టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి స్ప‌ష్టం చేశారు. తిరుమ‌ల అన్నమయ్య భవనంలో శ‌నివారం ఉద‌యం ఆయ‌న మీడియా సమావేశం నిర్వ‌హించారు.
 
ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మీడియాతో మాట్లాడుతూ ......  టిటిడి భక్తుల సౌకర్యార్థం అనేక కార్యక్రమాలు చేపడుతున్న‌ద‌ని, ఆ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి 176 కౌంటర్లు ఏర్పాటు చేశామ‌న్నారు.
 
ఉచిత దర్శన టికెట్ల జారీకి, టోల్ గేట్ల వద్ద టోకన్ల కేటాయింపునకు, గదుల కేటాయింపుకు, లడ్డూల జారీకి కౌంటర్లు నిర్వహిస్తున్నామ‌ని చెప్పారు. గతంలో త్రిలోక్ సంస్థ 89  కౌంటర్లు నిర్వహించేద‌ని, ఇందులో తిరుప‌తిలో ఎస్‌ఎస్‌డి దర్శన టోకెన్ల కేటాయింపు, క‌ల్యాణ‌క‌ట్ట‌లో టోకెన్ల జారీ, వైకుంఠం 1, 2ల‌లో ద‌ర్శ‌నం టికెట్ల స్కానింగ్ కౌంట‌ర్లు ఉన్నాయ‌న్నారు. టిటిడికి సంబంధించినంత వ‌ర‌కు ఇవి ఉచిత సేవ‌లని, ఆ సేవలు నిర్వహిస్తున్న సంస్థలకు గతంలో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించేద‌ని చెప్పారు.
 
2020 మార్చిలో త్రిలోక్ సంస్థ టిటిడి సర్వీసుల నుండి తప్పుకుంద‌ని, గతంలో త్రిలోక్ సర్వీసులు ఉచితమని చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తమ‌న్నారు. గ‌తంలో లడ్డూ పంపిణీ కేంద్రంలో 25 కౌంటర్లను మాత్రమే బ్యాంకులు నిర్వహించేవని, ఈ కౌంటర్లో పని చేసే సిబ్బందికి చాలా తక్కువ వేతనం చెల్లించేవార‌న్నారు.
 
అదేవిధంగా సంవత్సరంగా రెండు బ్యాంకులు మాత్ర‌మే 9 కౌంట‌ర్ల‌లో  సేవలు కొనసాగిస్తున్నాయ‌న్నారు. నగదు లావాదేవీలు ఉండటంతో బ్యాంకులు వాలంటీర్ గా తాము పని చేయలేమని తప్పుకున్నాయ‌ని,  బ్యాంకులు తమ సేవల నుండి తప్పుకోవాలని టిటిడి కోరలేద‌ని చెప్పారు.
 
భక్తులకు అసౌకర్యం కలగకుండా సంవత్సరం రోజులుగా టిటిడి సొసైటీ ఉద్యోగులు, శ్రీవారిల‌డ్డూ సేవకులతో కౌంటర్లు నిర్వహించామ‌న్నారు. భక్తులకు మెరుగైన సేవల కోసం వేరే మార్గం లేకపోవడంతో ఐదు సార్లు టెండర్లు పిలవగా ఐదవ సారి బెంగళూరుకు చెందిన‌ కెవిఎం ఇన్‌ఫో అతి తక్కువ ధరకు టెండ‌రు వేసింద‌న్నారు. కౌంటర్ సేవల్లో పారదర్శకత, వృత్తి నిపుణ‌త‌తో నిర్వ‌హించే ఏజెన్సీలకు టెండర్ ఇచ్చిన‌ట్లు వివ‌రించారు.
 
గతంలో 7 ఎఫ్ఎం ఏజెన్సీ ఒక కౌంటర్లో ఒక షిఫ్ట్ కు  రూ.12,345 ( జిఎస్టీ కాకుండా) ఉండగా,  ప్రస్తుతం కెవిఎం ఇన్‌ఫో రూ  11,402 కే ( జిఎఎస్టీ కాకుండా) టెండరు ఖరారయ్యింది. ఈ టెండర్లు కూడా ఎంతో పారదర్శకంగా నిర్వహించడం జరిగింద‌న్నారు. ప్ర‌స్తుతం 164 కౌంటర్లలో అవినీతిలేని సర్వీసులు అందించేందుకు రొటేషనల్ పద్ధతిలో విధులు కేటాయిస్తున్నామ‌న్నారు. గతంతో పోల్చితే కొత్త టెండర్ల వల్ల సంవ‌త్స‌రానికి రూ.56 లక్షలు టిటిడికి ఆదా అవుతోంద‌న్నారు.
 
కౌంటర్ల నిర్వహణ ఏజెన్సీలకు ఇవ్వడం ద్వారా నెలకు రూ.40,364/- స్పాన్సర్ చేసి కౌంట‌ర్ల‌లో సేవ‌లు అందించేందుకు 12 బ్యాంకులు ముందుకొచ్చాయ‌ని తెలిపారు.  ఒక్కో కౌంటర్ కు నెలకు రూ.40 వేలు చెల్లించి హిందూ సంస్ధలకు సంబంధించిన సంస్థలు స్పాన్సర్ షిప్ చేయచ్చ‌ని, కొత్త విధానంతో స్పాన్సర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవ‌న్నారు.
 
భక్తుల సేవల్లో పారదర్శకత కోసం తీసుకొచ్చిన  అద్భుతమైన విధానాన్ని వక్రీకరించి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అసత్య ప్రచారం తగద‌న్నారు. ఈ స‌మావేశంలో డెప్యూటీ ఈవోలు శ్రీ ర‌మేష్‌బాబు, శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, శ్రీ వెంక‌ట‌య్య‌, శ్రీ లోక‌నాధం, ఐటి విభాగాధిప‌తి శ్రీ శేషారెడ్డి త‌దిత‌రులు ఉన్నారు.