భాగ్యనగరం ప్రథమ పౌరురాలిగా గద్వాల విజయలక్ష్మి ఎన్నిక

gadwan vijayalakshmi
ఠాగూర్| Last Updated: గురువారం, 11 ఫిబ్రవరి 2021 (13:11 IST)
హైదరాబాద్ నగర ప్రథమ పౌరురాలిగా బంజారాహిల్స్‌ తెరాస కార్పొరేటర్‌, సీనియర్‌నేత కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. మేయర్‌ పదవి కోసం భాజపా తరపున ఆర్కేపురం డివిజన్‌ నుంచి ఎన్నికైన రాధ ధీరజ్‌రెడ్డి నామినేషన్‌ వేయగా.. ఎన్నికల అధికారి శ్వేతామహంతి ఓటింగ్‌ నిర్వహించారు.

అనంతరం విజయలక్ష్మి మేయర్‌‌గా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. మేయర్‌ ఎన్నికలో ఎంఐఎం కూడా తెరాస అభ్యర్థికే మద్దతు తెలిపింది. డిప్యూటీ మేయర్‌గా తార్నక కార్పొరేటర్‌ మోతె శ్రీలత విజయం సాధించారు. ఎంఐఎం మద్దతివ్వడంతో మేయర్‌, ఉప మేయర్‌ పదవులను తెరాస కైవసం చేసుకుంది.

ఇకపోతే, మేయర్‌ ఎన్నికకు ముందు జీహెచ్‌ఎంసీ నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం సందడిగా జరిగింది. తమకు అనుకూలమైన భాషలో ప్రమాణం చేసేందుకు అనుమతి ఇవ్వాలని వివిధ పార్టీల కార్పొరేటర్లు అధికారులకు విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు ప్రిసైడింగ్‌ అధికారి శ్వేతామహంతి.. నచ్చిన భాషలో ప్రమాణ స్వీకారానికి అనుమతిచ్చారు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్ల భాషలో కార్పొరేటర్లు ప్రమాణం చేశారు. తెరాస, భాజపా, ఎంఐఎం, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన 149 మంది కార్పొరేటర్లు ప్రమాణం చేశారు.దీనిపై మరింత చదవండి :