సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 4 జనవరి 2019 (12:04 IST)

భిక్షగాడు కృత్రిమ కాలులో కరెన్సీ.. వామ్మో...

అతడి పేరు షరీఫ్ సాబ్.. దాదాపు 15 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వలస వెళ్లి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ సమీపంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని వయస్సు 75 సంవత్సరాలు. రైల్వే స్టేషన్‌ సమీపంలో ఫుట్‌పాత్‌పై చిన్న గుడిసె వేసుకుని ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. బెంగుళూరు వచ్చిన తొలినాళల్లో కూలీ పనులు చేసినా, అనారోగ్యం కారణంగా భిక్షాటనే వృత్తిగా మార్చుకున్నాడు. 
 
కొంతకాలనికి గాంగ్రిన్‌ కారణంగా షరీఫ్‌ సాబ్ కుడికాలు తొలగించి ఆ స్థానంలో కృత్రిమ కాలును ఏర్పాటు చేసింది ఓ స్వచ్చంద సంస్థ. షరీష్ బిచ్చమెత్తుకోగా వచ్చిన డబ్బును కృత్రిమ కాలులోనే దాచుకునేవాడు. మంగళవారం ఉదయం కంటోన్మెంట్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని పబ్లిక్‌ టాయ్‌లెట్‌కు వెళ్లిన అతను అక్కడే హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని పరిశీలించిన రైల్వే పోలీసులు చనిపోయినట్లు నిర్థారించి హై గ్రౌండ్‌ ఠాణాకు సమాచారం అందించారు.
 
మృతదేహాన్ని తరలించే సమయంలో అతని కృత్రిమ కాలు బరువుగా అనిపించడంతో తీసి చూడగా అందులో 42 రూ.500 నోట్లు, 470 రూ.100 నోట్లు, 20 రూ.200 నోట్లు, 215 రూ.50 నోట్లు, 430 రూ.20 నోట్లు, 528 రూ.10 నోట్లతో కలిపి మొత్తం రూ.96,780 లెక్కతేలింది. అతడి వివరాలు ఆరా తీయగా అతడి పేరు షరీఫ్‌ సాబ్‌గాను, స్వస్థలం హైదరాబాద్‌ అని బయటపడింది. నగదుతో పాటు మృతదేహాన్ని అప్పగించేందుకు షరీఫ్‌ సంబంధీకుల వివరాలు ఆరా తీస్తున్నట్లు తెలయజేశారు గ్రేహౌండ్స్ పోలీసులు.