మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 మార్చి 2022 (11:47 IST)

టీఎస్ ఎంసెట్‌–2022 నోటిఫికేషన్‌- మార్చి 14న విడుదల?

టీఎస్ ఎంసెట్‌–2022 నోటిఫికేషన్‌ మార్చి 14వ తేదీన విడుదల కానుందని తెలుస్తోంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సోమవారం దీనిపై సమీక్షా సమావేశం జరిగింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్‌–2022 నోటిఫికేషన్‌ త్వరలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. 
 
ఇతర రాష్ట్రాల్లో విద్యార్థులు హాజరయ్యే సెట్‌లు, జేఈఈ, ఇతర జాతీయ పోటీ పరీక్షలను టీసీఎస్‌ పరిశీలించి.. ఎవరికీ ఇబ్బంది లేకుండా చూసేందుకుగానూ ఎంసెట్ తేదీలను ఖరారు చేయడంపై కసరత్తులు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. 
 
ఈ ప్రక్రియ 2 రోజుల్లో పూర్తయ్యే వీలుందని, అనంతరం ఎంసెట్‌ తేదీలను ఖరారు చేసి, ప్రభుత్వ అనుమతికి పంపుతామని అధికారులు చెప్పారు. కాగా మే నెలలో ఇంటర్మీడియెట్‌ పరీక్షలు పూర్తవుతాయి. 
 
అదే నెలలో జేఈఈ మెయిన్స్‌ పరీక్షలూ ఉంటాయి. ఇవన్నీ నిర్వహించిన తర్వాత ఎంసెట్‌ సన్నద్ధతకు విద్యార్థులకు కనీసం నెల రోజుల వ్యవధి ఉండాలని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జూన్‌ చివరి వారంలో ఎంసెట్‌ నిర్వహణకు అనుకూలంగా ఉన్నత విద్యా మండలి అధికారులు నిర్ణయించారు.