బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 జులై 2021 (15:28 IST)

#HappyBirthdaySonuSood మనస్సున్న మహారాజు..(video)

Sonu Sood
బాలీవుడ్ స్టార్ హీరో సోనూ సూద్ పేదల పాలిట పెన్నిధిగా నిలిచాడు. కరోనా టైమ్‌లో ప్రజలను ఆదుకోవడంతో నటుడు సోనూ సూద్ పేరు మార్మోగిపోయింది. లాక్‌డౌన్ సమయంలో వలస కూలీలను సొంతూళ్లకు పంపడం, కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ సిలిండర్లను అందించడం లాంటి పనులతో సోనూకు ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఇప్పటికే ఆయనకు ఆంధ్ర ప్రదేశ్‌లో గుడి కూడా కడుతుండటం గమనార్హం.
 
దేశవ్యాప్తంగా తన సేవలను విస్తరిస్తూ ముందుకెళ్తున్న సోనూ.. ఇవ్వాళ 48వ పడిలోకి అడుగు పెడుతున్నాడు. దీంతో ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సెలబ్రిటీలు, పొలిటీషియన్స్, ఇతర ప్రముఖులు మొదలు సాధారణ ప్రజలు, ముఖ్యంగా యువత సోనూకు బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాను ముంచెత్తారు. దీంత్తో ట్విట్టర్ ట్రెండింగ్‌లో హ్యాపీ బర్త్ డే సోనూ సూద్ ట్యాగ్ దూసుకెళ్తోంది. ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఈ ట్యాగ్ మూడో స్థానంలో ఉంది. 
 
పంజాబ్‌లోని మోగాలో 1973 జూలై 30న జన్మించిన సోనూ సూద్ శాక్రిడ్ హార్ట్ స్కూల్‌లో చదివి, తరువాత నాగపూర్‌లో ఇంజనీరింగ్ చేశారు. చదువు పూర్తయిన దగ్గర నుంచీ సోనూ సూద్‌కు సినిమాలపైనే మనసు మళ్ళింది. ఆ క్రమంలో మోడల్‌గా నటించారు. అందివచ్చిన పాత్రలను అంగీకరించారు. ఆరంభంలో తమిళ చిత్రాలలో నటించారు. నాగార్జున నిర్మించి, నటించిన ‘సూపర్’ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. 
 
అంతకు ముందే కొన్ని అనువాద చిత్రాల ద్వారా సోనూ తెలుగుజనానికి పరిచయమే. అంతేకాదు, ఆయనకు తెలుగువారితో ముందు నుంచీ బంధం ఉంది. 1996లోనే తెలుగమ్మాయి సోనాలీని పెళ్ళాడారు. వారికి అయాన్, ఇషాంత్ అనే ఇద్దరు అబ్బాయిలు. సోనూ ఆరంభం నుంచీ క్రమశిక్షణకు ప్రాణం ఇచ్చే మనిషి. తన శరీరసౌష్టవాన్ని చక్కగా రూపొందించుకోవడానికీ ఆయన శ్రమిస్తారు. 
 
సొంతవూరిలో జిమ్ పెట్టి, అక్కడి యువతలో దేహదారుఢ్యం పట్ల ఆసక్తి నెలకొల్పారు. ఊరిలో కూడా కష్టంలో ఉన్నవారికి చేతనైన సాయం అందించేవారు. చిత్రసీమలో ప్రవేశించిన తరువాత తన సంపాదనను వృథా పోనివ్వకుండా పొలాలు కొంటూ ఆస్తులు పోగేశారు. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ 150 కోట్ల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. ఆయన కంటే చిత్రసీమలో కోట్ల రూపాయలు సంపాదించేవారు ఎందరో ఉన్నారు. 
 
అయినా, తనకున్న దానిలోనే ఇతరులకు సాయం చేసే సోనూ సూద్ మంచిమనసును అందరూ అభినందిస్తున్నారు. దేశవ్యాప్తంగా తన దృష్టికి వచ్చిన కష్టజీవులకు కరుణతో సహాయం అందించారు. అందుకోసం ‘సూద్ ఛారిటీ’ నెలకొల్పారు. సోనూ మంచి మనసు చూసి, ఆయన ఛారిటీకి కొందరు దాతలు విరాళాలు ఇచ్చారు. 
Sonu Sood
 
అయినా సాయం చేసే మంచి మనసు అందరికీ ఉండాలి కదా! దేశంలో ఫస్ట్ లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది వలస కూలీలు కష్టాల పాలయ్యారు. వారిని చూసి చలించిన సోనూ సూద్ వారి వారి గ్రామాలకు చేరడానికి ఎంతో సహాయం చేశారు. అలాగే కిర్జిస్థాన్ లో చిక్కుకు పోయిన 1500 మంది విద్యార్థులను రప్పించడానికి ఛార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆదుకున్నారు. కష్టాల్లో ఉన్న ఓ రైతు కుటుంబానికి ట్రాక్టర్ కొనిచ్చారు.
 
యుపిఎస్సీ పరీక్షలకు వెళ్లాలనుకొనే ఆర్థిక స్తోమత లేనివారికి సరైన శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇలా పలు సేవాకార్యక్రమాలు చేస్తూ సాగిపోతున్న సోనూ సూద్ కు దేశవ్యాప్తంగా అగణిత అభిమానగణాలు వెలిశాయి. ప్రస్తుతం ఆయన చిరంజీవి ‘ఆచార్య’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. తమిళ చిత్రం ‘తమిళరసన్’లోనూ, హిందీ సినిమా ‘పృథ్వీరాజ్’లోనూ ఆయన నటిస్తున్నారు. సోనూ సూద్ కు ప్రస్తుతం ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఎందరో ఆయన హీరోగా సినిమాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు.