శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2024 (19:28 IST)

అనుబంధాలకు పెద్ద పీట వేసిన చిట్టి పొట్టి చిత్రం రివ్యూ

Chiti potti
Chiti potti
నటీనటులు: రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి, కాంతమ్మ, ఆచారి, హర్ష, సతీష్, రామకృష్ణ, సరళ, తదితరులు 
సాంకేతితక సిబ్బంది:  సినిమాటోగ్రఫీ - మల్హర్ భట్ జోషి, మ్యూజిక్ - శ్రీ వెంకట్, ఎడిటర్ - బాలకృష్ణ బోయ, కథ- స్క్రీన్ ప్లే- నిర్మాత- దర్శకత్వం - భాస్కర్ యాదవ్ దాసరి
 
కథ:  
కిట్టు (రామ్ మిట్టకంటి)కి చిట్టి(పవిత్ర)  అంటే తనకి పంచ ప్రాణాలు. అల్లారుముద్దుగా చూసుకునే చెల్లిని ఓ ఆకతాయి అవమానికి గురిచేస్తాడు. దాంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతుంది. ఈ పరిస్థితి గమనించిన కాబోయే భర్త కూడా చిట్టిని అనుమానిస్తాడు. ఇలాంటి క్రమంలో ఓ అన్నగా కిట్టు తన చెల్లిని కాపాడాడా? లేదా? కిట్టు ప్రేమించిన అమ్మాయి ఏమయింది? తను ఉద్యోగం పొందాడా లేడా? అసలు చిట్టి అవమానానికి గురయిన విషయం ఏమిటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 
సమీక్ష:
టైటిల్ ను బట్టే ఇది అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ కథ అని ఇట్టే తెలిసిపోతుంది. ఈ తరహా చాలా సినిమాలు వచ్చాయి. కానీ నేటి ట్రెండ్ కు తగినట్లుగా ఫేస్ మార్ఫింగ్ తో ఆడవాళ్ళ జీవితాల్లో ఆడుకునే ఆవారాగాళ్ళు ను కూడా కథపరంగా చూపించాడు. అలాంటి వారికి ఎలాంటి శిక్ష వేయాలనేది కిట్టు పాత్రలో దర్శకుడు చూపించాడు. నేటితరం యూత్ కు కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా పట్టణాలలో నేటి కాలంలో  బంధాలు, బంధుత్వాలు మర్చిపోయారు. పక్కపక్కనే జీవిస్తున్నా... మన స్నేహితులెవరో, మన చుట్టాలెవరో కూడా మనం గుర్తించలేం. వాటిని సరైన సన్నివేశంలో దర్శకుడు తెలియజెప్పాడు.
 
 చెల్లి పెళ్లి సందర్భంగా దూరమయిన బంధుగణం వచ్చేలా చేయడం బాగుంది. ఇది ప్రతి ఒక్కరినీ కనెక్ట్ అవుతుంది. చివరి ఇరవై నిమిషాలు ప్రతి ఒక్కరూ ఏమోషన్ కు గురై... కంటతడి పెడతారు. దర్శకుడు ఫస్ట్ హాఫ్ అంతా అన్నా చెల్లెళ్ల అనుబంధం పైనే  చూపాడు. సెకెండాఫ్లో  సన్నివేశాలతో చాలా ఎమోషనల్ గా తెరకెక్కంచారు. క్షణికావేశంలో చిన్న చిన్న మనస్పర్థలు ఏర్పడి దూరమైన అన్నా చెల్లెళ్లు, బావా బావమర్దులు, వదిన, ఆడబిడ్డలు ఇలా అందరిని ఓ చోటుకు చేర్చడానికి రాసుకున్న ఏమోషనల్ స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. 
 
రామ్ మిట్టకంటి నటుడిగా సరిపోయాడు. అన్నగా, బాధ్యతగల మనిషిగా బాగా చేశాడు. ఇష్టమైన జాబ్ కోసం కష్టపడే ఓ నిబద్ధత కలిగిన యువకునిగా లవర్ బోయ్ గా  ముద్రను చూపించారు. యాక్షన్ సీన్స్ ను చాలా బాగా చేశాడు. చెల్లిగా నటించిన పవిత్ర కూడా చాలా బాగా చేసింది. ఇద్దరూ సొంత అన్నా చెళ్లెల్లా అనే విధంగా నటించేశారు. బామ్మలుగా, తాతలుగా, వదిన పాత్రలు పోషించిన వారంతా తమతమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.
 
సాంకేతికంగా చూస్తే,  దర్శకుడు సిస్టర్ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ బాగా రాసుకున్నాడు. నేటి ట్రెండ్ వింత పోకడలను కూడా టచ్ చేశారు. ఈ సినిమాకి తనే నిర్మాత కావడంతో క్వాలిటీగా నిర్మించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సంగీతం బాగుంది. పాటలన్నీ ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. పాటల పిక్చరైజేషన్ విజువల్ గా బాగా చిత్రీకరించారు. అయితే అక్కడక్కడా చిన్నపాటి లోపాలున్నాయి. ఎడింటింగ్ మరింత పని చెప్పాల్సింది. ఏది ఏమైనా చెల్లెలె సెంటిమెంట్ కథలు కుటుంబంతో చూడతగ్గ సినిమాగా వుంటాయి. ఈ సినిమా కూడా అలాంటిదే. 
రేటింగ్: 2.75/5