ఆంధ్రప్రదేశ్ సచివాలయంగా రజత్ భార్గవ మిలీనియం టవర్?!

vizag millennium tower
ఠాగూర్| Last Updated: గురువారం, 9 జనవరి 2020 (11:06 IST)
నవ్యాంధ్ర రాజధానిని వైజాగ్‌కు మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాజధాని అమరావతి ప్రాంతంలో ఉద్యమం ఒక్కసారిగా ఎగిసిపడింది. అదేసమయంలో రాజధాని తరలింపు పనులు మాత్రం ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులోభాగంగా, సాధారణ పరిపాలనా శాఖ అధికారులు విశాఖపట్టణంలో విస్తృతంగా పర్యటిస్తూ, అందుబాటులో ఉన్న భవనాలను పరిశీలిస్తున్నారు. ఇందులోభాగంగా వైజాగ్‌లో గత ప్రభుత్వం నిర్మించిన మిలీనియం టవర్‌-1ను పరిశీలించారు. అలాగే, నిర్మాణంలో ఉన్న టవర్-2 ఎపుడు అందుబాటులోకి వస్తుందంటూ అధికారులు ఆరా తీశారు. అంతేకాకుండా, ఐటీ హిల్స్‌లోని హెల్త్ సర్వీసెస్ భవనాన్ని కూడా అధికారులు పరిశీలించారు.

ఒకవైపు రాజధానిని మరో ప్రాంతానికి తరలించవద్దు అంటూ అమరావతి ప్రాంతంలో రైతులు, రాజకీయ పార్టీల నేతలు ఏకమై ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. మరోవైపు, గురువారం నుంచి అమరావతి రైతు పరిక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పడిన జేఏసీ రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటున్నారు. ఈ యాత్ర తొలుత శ్రీకాకుళం నుంచే ప్రారంభించనున్నారు.

మరోవైపు, విశాఖలో సచివాలయం ఏర్పాటుకు అవసరమైన వసతి సదుపాయం కోసం అధికారుల వెతుకులాట ఏకకాలంలో కొనసాగుతున్నాయి. బుధవారం పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీఐఐసీ ఎండీ రజత్ భార్గవ విశాఖ విచ్చేసి ఇక్కడి ఐటీ క్యారిడార్‌లోని పలు భవనాలను పరిశీలించారు. ఇప్పటికే పలు దఫాలుగా అమరావతి నుంచి ఉన్నతాధికారులు వచ్చి నగరంలోని పలు భవనాల్లో అనుకూలతలపై ఆరాతీస్తున్నారు.

తొలుత రజత్ భార్గవ మిలీనియమ్ టవర్‌ను పరిశీలించారు. అనంతరం దాని వెనుక నిర్మాణంలో ఉన్న టవర్-బిని సందర్శించారు. పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయని ఆరాతీశారు. ఈ సందర్భంగా నగరంలో విధులు నిర్వహిస్తున్న పలువురు ఐఏఎస్ అధికారులు రజత్ భార్గవను మర్యాదపూర్వకంగా కలుసుకుని పలు అంశాలు వివరించారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మిలీనియం టవర్‌ను ఏపీ సచివాలయంతోపాటు.. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం.దీనిపై మరింత చదవండి :